Share News

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద రాత్రంతా ఉద్రిక్తత!

ABN , Publish Date - Aug 10 , 2024 | 07:16 AM

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవి‌తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు...

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద రాత్రంతా ఉద్రిక్తత!

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Sreenivas) ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవి‌తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యాకూతురిని చూసి చిందులు తొక్కారు. భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్యాకూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు.


Duvvada-Srinivas.jpg

దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యవహారశైలిపై ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె డాక్టర్‌ హైందవి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి వరకూ శ్రీనివాస్‌ ఇంటి వద్ద ఆయన కుమార్తెలు నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం టెక్కలిలో ఆయన భార్య, కుమార్తె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాను.. తన భర్త నిర్వాకంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు.


Duvvada-Daughter.jpg

హైందవి మాట్లాడుతూ.. తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలోఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి కూడా శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసమే వాణి తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. శ్రీను తనను ఎప్పుడూ రాజకీయాల్లోకిగానీ.. ఇతర కార్యక్రమాల్లోకి పిలవలేదని తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉండాలని.. వాణి పిలిచి మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారనాన్నరు. వాణి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము స్నేహితుల్లా ఉంటున్నామని మాధురి తెలిపారు.


Duvvada-Rachha.jpg

మరోవైపు.. వాణి, కుమార్తెలు.. శుక్రవారం రాత్రి నేరుగా అక్కవరంలో ఉన్న శ్రీను ఇంటివద్దకు తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్లారు. గేటు తొలగించుకొని తన భర్త నివాసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే పోలీసు బలగాలు, దువ్వాడ శ్రీనివా్‌సతో పాటు ఆయన సోదరులు, అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణిని గదమాయించారు. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోయి భార్యను బూతులు తిడుతూ రాడ్డుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, తన సంగతి, తన పిల్లల సంగతి తేల్చేంత వరకూ ఇక్కడే ఉంటామని వాణితో పాటు కుమార్తెలు శ్రీనివా్‌సకు బదులిచ్చారు. ఇది పలాస కాదని, తన సొంతం ప్రాంతం టెక్కలి అని, ఇటువంటి వ్యవహారాలు సరికాదని వాణి స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకుని ఆమెను నిలువరించారు. శ్రీనివాస్‌ ఇంట్లోకి వెళ్లిపోయినా వాణితో పాటు కుమార్తెలు అక్కడే ఉన్నారు.

Madhuri-Duvvad.jpg

Updated Date - Aug 10 , 2024 | 07:52 AM