AP Elections: టీడీపీ-జనసేన తొలి జాబితా నేడే..
ABN , Publish Date - Feb 24 , 2024 | 03:52 AM
TDP-Janasena: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తోంది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
65 మంది అభ్యర్థుల ప్రకటన!
తెలుగుదేశం నుంచి 50-52 మంది
జనసేన తరఫున 15 మంది
ఉదయం 11.40కి ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు, పవన్
కుప్పం బరిలో టీడీపీ అధినేత
భీమవరంలో జనసేనాని పోటీ
టెక్కలి-అచ్చెన్న, మంగళగిరి-లోకేశ్
తెనాలి నాదెండ్ల మనోహర్‌కు
100కిపైగా చోట్ల కసరత్తు పూర్తి
బీజేపీ రాకతో ప్రకటన వాయిదా
మాఘ పౌర్ణమి కావడంతో ఇబ్బందుల్లేని సీట్లలో అభ్యర్థుల వెల్లడి
బీజేపీ నాయకత్వానికీ సమాచారం
కొందరు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే చాన్సు
ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు, ఎమ్మెల్యేలు వసంత, పార్థసారథి
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా
అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన (TDP-Janasena) అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తోంది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య ముహూర్తం బాగుందని పండితులు చెప్పడంతో.. రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) కలిసి ఉమ్మడిగా దీనిని విడుదల చేస్తారని సమాచారం. జాబితాలో 65 మంది వరకు అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. వీరిలో టీడీపీ నుంచి 50-52 మంది, జనసేన నుంచి సుమారు 15 మంది ఉంటారని అంటున్నారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఇక్కడి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. ఉదయం ఉండవల్లికి రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్ తదితరులకు పిలుపు వెళ్లింది. విషయమేంటో వారికి చెప్పకపోయినా జాబితా విడుదలపైనే సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాకు సంబంధించిన అంశాలను పార్టీ నేతలతో పంచుకునే ఆనవాయితీని చంద్రబాబు అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నారు. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేన నాయకత్వాలు చాలా రోజుల కిందటే తయారుచేశాయి. వందకు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేశాయి కూడా.
ఈ నెల రెండో వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్నా.. బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదావేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణం. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. అదీగాకఈ ముహూర్తం దాటితే మళ్లీ రెండు వారాల వరకూ మళ్లీ అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో శనివారాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చేరవేశారు. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగసభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.
ఇద్దరు, ముగ్గురి విషయంలోనే సమస్య
చంద్రబాబు కుప్పంలో, పవన్ కల్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (టెక్కలి), జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (మంగళగిరి), జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ (తెనాలి) పేర్లు కూడా తొలి జాబితాలో ఉంటాయని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. తమ సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఇందులో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు.. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి సీటు మారనున్నారు. ఆయనకు చీపురుపల్లి సీటివ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తుండగా.. ఆయన మాత్రం భీమిలి సీటును ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని నిలుపుతారా లేక ఆమె భర్త వాసు పోటీచేస్తారా అనే విషయంపై పార్టీ వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇలాంటివి రెండు మూడు మినహాయించి మిగిలిన సిటింగ్ ఎమ్మెల్యేల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశముంది.