Share News

Inter Colleges: లెక్చరర్లు లేని ఇంటర్‌ విద్య

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:58 AM

ఇంటర్మీడియెట్‌పై ఇంటర్‌ విద్యామండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. శనివారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లను రెన్యువల్‌ చేయలేదు.

Inter Colleges: లెక్చరర్లు లేని ఇంటర్‌ విద్య

రెన్యువల్‌ కాని కాంట్రాక్టు జేఎల్స్‌

ఇంటర్‌కు జూనియర్‌ లెక్చరర్లే కీలకం.. ప్రతిపాదనలు పంపని బోర్డు

నేటి నుంచి రాష్ట్రంలో క్లాసులు ప్రారంభం

ఎండలు మండుతున్నా కాలేజీలు రీ ఓపెన్‌

ప్రారంభంకాని సప్లిమెంటరీ మూల్యాంకనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియెట్‌పై ఇంటర్‌ విద్యామండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. శనివారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లను రెన్యువల్‌ చేయలేదు. కనీసం రెన్యువల్‌కు ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు కూడా పంపలేదని తెలిసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రెన్యువల్‌ సాధ్యం కాదనే ఆలోచనతో అధికారులు దీనిని పట్టించుకోలేదు.

మరోవైపు ఇతర శాఖలు మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులను రెన్యువల్‌ చేసుకున్నాయి. మిగిలిన శాఖల సంగతి ఎలావున్నా ఇంటర్మీడియెట్‌లో కాంట్రాక్టు లెక్చరర్లు కీలకం. 470 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ జేఎల్స్‌ 900 మంది పనిచేస్తుంటే, కాంట్రాక్టు జేఎల్స్‌ 3,600 మంది ఉన్నారు. మరో 1,030 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అంటే కాంట్రాక్టు, గెస్ట్‌ ఫ్యాకల్టీ లేకపోతే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు నడపడం వీలుకాదు. అలాంటి కీలకమైన జూనియర్‌ కాలేజీల విషయంలో ఇంటర్‌ విద్యాశాఖ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాంట్రాక్టు జేఎల్స్‌తో పాటు గెస్ట్‌ ఫ్యాకల్టీని కూడా రెన్యువల్‌ చేయలేదు. దీంతో శనివారం నుంచి కాలేజీలకు వెళ్లాలా? లేదా? అనే సందిగ్ధంలో కాంట్రాక్టు జేఎల్స్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉన్నారు. కాగా, రెన్యువల్‌ కాకపోయినా విధులకు హాజరు కావాలంటూ కొన్ని చోట్ల అధికారులు వారిని ఆదేశిస్తున్నారు.


విధులకు హాజరైనా సాంకేతికంగా రెన్యువల్‌ అయ్యే వరకు జీతం ఇవ్వరు కదా అని కాంట్రాక్టు జేఎల్స్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏటా 10 రోజుల గ్యాప్‌తో కాంట్రాక్టు జేఎల్స్‌ను రెన్యువల్‌ చేసేవారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెలాఖరుతో కాంట్రాక్టును ముగించి, 10 రోజుల్లో రెన్యువల్‌ చేసేవారు. దీంతో 10 రోజులు మినహా మిగతా జీతం వారికి అందేది.

  • నెరవేరని హామీ

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల పాటు అదే విధానం కొనసాగింది. ఒక సంవత్సరం ఒక రోజు గ్యాప్‌తో రెన్యువల్‌ చేశారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఒక్కరోజు కూడా గ్యాప్‌ లేకుండా కాంట్రాక్టు ముగిసిన తర్వాత రోజే రెన్యువల్‌ చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం మళ్లీ నిర్లక్ష్య వైఖరిని మొదలుపెట్టింది. వాస్తవానికి వీరందనీ రెగ్యులరైజ్‌ చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐదేళ్లలో చేయలేదు.

కానీ, తాజా ఎన్నికల ముందు రెగ్యులర్‌ చేస్తామంటూ హడావుడి చేసింది. చివరికి పలు కారణాలు చూపి పక్కన పెట్టింది. ఇప్పుడు కనీసం రెన్యువల్‌ కూడా చేయకుండా వారిని అంతర్మథనంలో పెట్టింది. మరోవైపు, ఇంత వరకు ఇంటర్‌ విద్యాశాఖ రెన్యువల్‌కు ప్రతిపాదనలే పంపలేదు. ఇప్పుడు పంపినా ఆర్థిక శాఖ ఆమోదానికి నెల పైగా పట్టే అవకాశం ఉంది. దీంతో రెన్యువల్‌ అయ్యే వరకు కాలేజీలు ఎలా నడపాలనే ప్రశ్న నెలకొంది.

  • ఎండలున్నా తరగతులే

షెడ్యూలు ప్రకారం శనివారం ఇంటర్‌ తరగతులు ప్రారంభం కావాలి. రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ జూన్‌ 10న ప్రారంభమవుతుంది. జూలై 1లోగా రెండో విడత అడ్మిషన్లు పూర్తి చేస్తారు. అయితే, ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నా ఇంటర్‌ బోర్డు యథావిధిగా కాలేజీలు పునఃప్రారంభిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగుస్తాయి. ఈసారి మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేయాలని నిర్ణయించారు. ఇంకా పరీక్షలు పూర్తికాకపోవడం, సమాధాన పత్రాలు స్కానింగ్‌ చేస్తుండటంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మూల్యాంకనానికి కనీసం 10 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యా్‌పలు లేనివారు ఏం చేయాలని జేఎల్స్‌ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 4రోజుల్లో ఎన్నికల ఫలితాలొస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీల ప్రారంభాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తే బాగుంటుందని జేఎల్స్‌ కోరుతున్నారు. కానీ, జేఎల్స్‌ లేకపోయినా కాలేజీలు రీఓపెన్‌ అవుతాయని అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం.

Updated Date - Jun 01 , 2024 | 06:37 AM