AP Weather: తప్పిన తుఫాను ముప్పు
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:02 AM
Weather Report: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10గంటలకు
ఉత్తర ఒడిసా దిశగా ‘దానా’ పయనం..
నేడు తీవ్ర తుఫాన్‌గా బలపడే చాన్స్
రేపు ఉదయంలోగా ఒడిసాలో తీరం దాటే అవకాశం
ఒడిసాలో 110 కి.మీ. వేగంతో గాలులు?
పలు రైళ్లు రద్దు
కల్లోలంగా సముద్రం..
ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు
26 వరకు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక
విశాఖపట్నం, విజయవాడ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10గంటలకు ఒడిసాలోని పారాదీ్‌పకు 420 కి.మీ, ధామ్రాకు 450 కి.మీ, సాగర్ ద్వీపానికి(పశ్చిమ బెంగాల్) 500కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి ఒమన్ దేశం సూచించిన ‘దానా’ అని పేరు పెట్టారు. తుఫాను వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి గురువారం ఉదయానికి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తరువాత అదే దిశలో పయనించి గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిసాలోని భిటార్కనికా, ధామ్రా సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ. వేగంతో అప్పుడప్పుడు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరంలో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని పేర్కొంది. ఒడిసా తీర ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, పల్లపు ప్రాంతాలు నీట మునగడంతోపాటు రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుకోస్తా, ఆగ్నేయ రైల్వేలు అనేక రైళ్లను రద్దు చేశాయి. తూర్పు మధ్య, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటను నిషేధించారు. ఉత్తరాంధ్ర తీరం వెం బడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 26వ తేదీ వర కు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు సమాచారం అందించారు. తీవ్ర తుఫాను ఒడిసాలో తీరం దాటుతున్నందున ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
భిటార్కినికా పార్కులో మొసళ్లకు ముప్పు..
ఒడిసాలోని కేంద్రపారా జిల్లా భిటార్కినికా, ధామ్రా సమీపాన తీవ్ర తుఫాన్ తీరం దాటుతున్నందున భిటార్కినికా నేషనల్ పార్కులోని అరుదైన ఉప్పునీటి మొసళ్లు, చుక్కల జింకలు, కొండచిలువలు, పలు రకాల పక్షులు, అడవి పందులకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇది సుమారు 200 చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలో రెండో అతి పెద్ద మడ అడవిగా ప్రసిద్ధి చెందింది. బ్రాహ్మణి, బైతరణి నదులు బంగాళాఖాతంలో కలిసిన ప్రాంతంలో ఈ పార్కు ఏర్పాటుచేశారు. తీవ్ర తుఫాను ప్రభావంతో సముద్ర అలలు ఎగిసిపడి పార్కులోకి నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉన్నందున మొసళ్లు, ఇతర జంతువులు, పక్షుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే 200 చ.కి.మీ విస్తరించిన మడ అడవులు తుఫాన్ గాలులను కొంత వరకు నిలువరిస్తాయని రిటైర్డు అటవీ అధికారి ఒకరు చెప్పారు.
రైల్వే కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
విజయవాడ డివిజన్ పరిధిలో 14 చోట్ల రైల్వేశాఖ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సామర్లకోట 8842327010, నెల్లూరు 08612345863, విజయవాడ 8662576924, రాజమండ్రి 08832420541, అనకాపల్లి 7569305669, ఏలూరు 7569305268, గూడూరు 08624250795, నిడదవోలు 08813223325, ఒంగోలు 8592280306, తాడేపల్లిగూడెం 8818226162, తుని 08854252172, తెనాలి 8644227600, గుడివాడ 7815909462, భీమవరం టౌన్ 7815909402 నంబర్లలో సంప్రదించాలి.
53 రైళ్లు రద్దు..
తుఫాను నేపథ్యంలో అధికారులు ఈ నెల 29వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం మీదుగా వెళ్లే 53 రైళ్లను రద్దు చేశారు. బెంగ ళూరు నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్లే రైళ్లు, హైదరాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే రైళ్లు, పట్నా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైళ్లు, సికింద్రాబాద్- భువనేశ్వర్, బెంగళూరు-గౌహతి, ముంబై-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, తంబారం-సంత్రాగచి మధ్య నడిచే రైళ్లను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. 24న బెంగళూరు-హౌరా హంసఫర్ ఎక్స్‌ప్రెస్(22888), భువనేశ్వర్-ముంబై కోణార్క్(11020), భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్(12830), హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18046), 25న చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ సూపర్‌ఫాస్ట్(12829), గుణుపూర్-కటక్ మెము పాసింజర్(08422), భువనేశ్వర్-విశాఖ వందేభారత్(20841), భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ(17015), భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి(18463), భువనేశ్వర్-రామేశ్వరం(20896), పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్‌రఽథ్ ఎక్స్‌ప్రెస్(22883), 26న పూరి-గాంధీథాం(22874), సికింద్రాబాద్-సిలిచర్ (12513), యశ్వంత్‌పూర్-పూరి గరీబ్‌రఽథ్(22884), మంగుళూరు సెంట్రల్-సంత్రాగచ్చి వివేక్ ఎక్స్‌ప్రెస్(22852), బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్‌ప్రెస్(12551), 27న రామేశ్వరం-భువనేశ్వర్(20895), వాస్కోడిగామ-షాలిమార్ అమరావతి (18048), 29న మాల్దా టౌన్-సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (03430)లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు.