Share News

ZP employees : ఇది పాట కానే కాదు..!

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:23 AM

జడ్పీ ఉద్యోగుల బదిలీలకు బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. ‘లచ్చ.. లచ్చన్నర... అంతకు మించి..’ అని పోటీ పడుతున్నారు. హాట్‌ సీటు కోసం భారీగా బేరాలకు దిగుతున్నారు. సాధారణ బదిలీలను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇలా పోటీ పెట్టి దండుకుంటున్నారు. జడ్పీలో ఏవో, సీనియర్‌ అసిస్టెంట్‌ సీట్లను అమ్మకానికి పెట్టారు. 22వ తేదీనే (కటాఫ్‌ డేట్‌) బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా.. 23వ ...

ZP employees : ఇది పాట కానే కాదు..!
Employees and officers who are sleeping at night at ZP

లచ్చ.. లచ్చన్నర.. రెండు లచ్చలు..

జడ్పీ సాధారణ బదిలీల్లో బేరసారాలు

22న ఉత్తర్వులు ఇవ్వాలి.. ఇంకా ఇవ్వలేదు

అనంతపురం విద్య, సెప్టెంబరు 23: జడ్పీ ఉద్యోగుల బదిలీలకు బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. ‘లచ్చ.. లచ్చన్నర... అంతకు మించి..’ అని పోటీ పడుతున్నారు. హాట్‌ సీటు కోసం భారీగా బేరాలకు దిగుతున్నారు. సాధారణ బదిలీలను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇలా పోటీ పెట్టి దండుకుంటున్నారు. జడ్పీలో ఏవో, సీనియర్‌ అసిస్టెంట్‌ సీట్లను అమ్మకానికి పెట్టారు. 22వ తేదీనే (కటాఫ్‌ డేట్‌) బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా.. 23వ తేదీ ఉదయం నుంచి అదిగో.. ఇదిగో అంటూ ఉత్తర్వులు ఇవ్వకుండా కథ నడిపారు. రాత్రి వరకూ పలువురు ఉద్యోగులు జడ్పీకి వస్తూనే ఉన్నారు. ఆఖరికి 24న ఇస్తారని చెప్పడంతో వెనుతిరిగారు.

అంతా గోప్యత..

జడ్పీలో బదిలీలపై ఆది నుంచి గోప్యత పాటిస్తున్నారు. కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నెల చివరి వారానికి బదిలీల కోసం ఉద్యోగుల నుంచి 446 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ఒకే స్టేషనలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు 286 మంది ఉన్నారు. ఇందులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు 15 మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 25 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 43 మంది, టైపిస్టులు 18 మంది, డ్రైవర్లు ఇద్దరు, రికార్డు అసిస్టెంట్లు 70 మంది, ల్యాబ్‌ అసిస్టెంట్లు 20 మంది, లైబ్రరీ అసిస్టెంట్‌ ఒకరు, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ 89 మంది, నైట్‌ వాట్‌మెన ముగ్గురు ఉన్నారు. రిక్వెస్టు ట్రాన్సఫర్స్‌ కోసం 215 మంది ఉద్యోగులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులతోపాటు ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఉత్తర్వులపైన కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు.


భారీగా బేరసారాలు

జిల్లా పరిషత పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న బదిలీల్లో భారీగానే బేరసారాలు సాగుతున్నట్లు తెలిసింది. జడ్పీ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ సీట్లకు డిమాండ్‌ ఎక్కువ కావడంతో.. చాలా మందిని జిల్లా కేంద్రం నుంచి దూరంగా పారేసినట్లు తెలిసింది. అయినవారి కోసం ఇక్కడ పనిచేస్తున్న వారిని సాగనంపి, క్యాష్‌ కొట్టిన వారికి హాట్‌ సీట్లు అప్పజెప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలనాపరమైన బదిలీలు అంటూ.. అడ్డగోలుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీలకు లక్ష నుంచి రెండు లక్షలు, అంతకుమించి అన్నట్లుగా డబ్బులు వసూలు చేశారని సమాచారం. ఒకరిద్దరు ఏవోలు, సీనియర్‌ అసిస్టెంట్లు ఈ తతంగాన్ని నడిపినట్లు తెలిసింది.

రాత్రి వరకూ పడిగాపులు..

జడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓల బదిలీల ఈనెల 22వ తేదీనే ఉత్తర్వులు వచ్చాయి. ఆ లోపు సాధారణ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేసి, ఉద్యోగులకు, సిబ్బందికి బదిలీల ఉత్తర్వులు జారీ చెయ్యాలి. కానీ 23వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉద్యోగులను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. రాత్రి కూడా ఉద్యోగులు జడ్పీ వద్ద పడిగాపులు కాశారు. కానీ 24వ తేదీ బదిలీ ఉత్తర్వులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఉద్యోగుల సాధారణ బదిలీల వెనుక భారీగానే అక్రమాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ దృష్టి సారిస్తే అక్రమాలు బయట పడే అవకాశం ఉంది. బదిలీల్లో ఉత్తర్వుల జాప్యం, ఉద్యోగుల ఎదురుచూపులు, ఇతర అంశాలపై వివరణ కోసం జడ్పీ సీఈఓకు ఫోన చేయగా.. అందుబాటులోకి రాలేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 24 , 2024 | 12:23 AM