Tirumala : తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 16 , 2024 | 05:23 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేశాక హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
తిరుమల, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేశాక హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేదపండితులు పంచసూక్తాలను పఠించిన తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది.
మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలను కూడా ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ జీయర్‌స్వాములు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.