Share News

Tragic Incident: తల్లీబిడ్డలను కాటేసిన కరెంటు తీగ

ABN , Publish Date - Dec 10 , 2024 | 06:29 AM

తెగిపడిన కరెంటు తీగపై కాలు వేసిన కొడుకుని కాపాడబోయి తల్లి, ఆ తల్లిని కాపాడబోయి కూతురు... ఇలా విద్యుత్‌ షాక్‌తో ముగ్గురూ మృతిచెందారు.

Tragic Incident: తల్లీబిడ్డలను కాటేసిన కరెంటు తీగ

  • కొడుకును కాపాడబోయి తల్లి.. తల్లిని పట్టుకుని కుమార్తె

  • విద్యుత్‌ షాక్‌తో ముగ్గురూ మృతి

పెదబయలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెగిపడిన కరెంటు తీగపై కాలు వేసిన కొడుకుని కాపాడబోయి తల్లి, ఆ తల్లిని కాపాడబోయి కూతురు... ఇలా విద్యుత్‌ షాక్‌తో ముగ్గురూ మృతిచెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామ శివారులో కొర్ర మోహనరావు కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం మోహనరావు పెదబయలు వారపు సంతకు వెళ్లాడు. భార్య లక్ష్మి, నలుగురు పిల్లలు ఇంటి వద్ద ఉన్నారు. సుమారు 11 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న వారి కుమారుడు సంతోష్‌ (13)... సమీపంలో తెగి పడి ఉన్న విద్యుత్‌ వైర్‌ను గమనించకుండా దానిపై కాలు వేశాడు. సంతోష్‌ గిలగిలా కొట్టుకుంటూ పడిపోవడంతో అక్కడే ఉన్న తల్లి లక్ష్మి (36)... ఏమైందంటూ అతడిని పట్టుకుంది.

దీంతో ఆమె కూడా షాక్‌కు గురైంది. తల్లి, సోదరుడికి ఏం జరిగిందోననే కంగారులో కుమార్తె అంజలి (10) కూడా వారిని తాకడంతో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. మరో ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి తల్లి వద్దకు వెళుతుండగా అటువైపుగా పశువులు తోలుకెళ్తున్న కోటేశ్వరరావు చూసి వారిని ఆపేశాడు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్ళి విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు. కానీ, అప్పటికే ముగ్గురూ చనిపోయారు.

Updated Date - Dec 10 , 2024 | 06:29 AM