Share News

YSRCP’s Leaders Scandals : అధికారంతో అరాచకం

ABN , Publish Date - Dec 09 , 2024 | 06:18 AM

ఐదేళ్ల కాలంలో అంతులేని దందాల కథ ఇది! సినిమాలుగా తీస్తే పది సీక్వెల్‌లు అవుతాయి! సీరియల్‌గా తీస్తే వందల ఎపిసోడ్లు కావాల్సిందే! రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు.

YSRCP’s Leaders Scandals : అధికారంతో అరాచకం
YSRCP

  • ఐదేళ్ల జగన్‌ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ

  • చేతులు మారిన వేల ఎకరాల భూములు

  • ఇసుక, గనులు, రేషన్‌లో భారీ అక్రమార్జన

  • నంబర్‌ టూ పెద్దిరెడ్డి వేల కోట్ల ఆర్జన

  • పల్నాడులో పిన్నెల్లి సంపాదన రూ.1000 కోట్లు

  • కార్మికుల శ్రమ దోచుకున్న శంకరనారాయణ

  • రోజా ఇలాకాలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బేరం

  • కడప జిల్లాలో 3500 ఎకరాల ఆక్రమణ

  • ఎవరైనా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే పోలీసులు, సంబంధిత అధికారులకు బాధితులు ఫిర్యాదు చేస్తారు. అవసరమైతే ప్రజాప్రతినిధులనూ కలసి మొరపెట్టుకుంటారు. అలాంటిది.. అధికార పార్టీ నేతలే దాదాగిరి చేస్తే? వారికి అధికారులూ వత్తాసు పలికితే? బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? గత ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఇదే పరిస్థితి. అంతా మాఫియా మోడల్‌.

  • వైసీపీ నేతల కన్నుపడిందంటే... విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు, కొండలు, చెరువులు, చివరకు రోడ్లు కూడా స్వాహా. ప్రకృతి వనరులు ఇసుక, గనులు దోపిడీ. రేషన్‌ మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు. ఉద్యోగులకు పోస్టింగ్‌లు కావాలంటే లంచాలు. ఇక సెటిల్మెంట్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు.. ఎవరైనా ఎదిరిస్తే అక్రమ కేసుల బనాయింపు.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఐదేళ్ల కాలంలో అంతులేని దందాల కథ ఇది! సినిమాలుగా తీస్తే పది సీక్వెల్‌లు అవుతాయి! సీరియల్‌గా తీస్తే వందల ఎపిసోడ్లు కావాల్సిందే! రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు. జగన్‌ ‘ఘనత’ రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరగా... ఆయన పార్టీ నేతలు తమకు చేతనైనంతగా చెలరేగిపోయారు. గత ఐదేళ్లలో ఒక్క మద్యంలోనే తాడేపల్లికి 3,100 కోట్ల ముడుపులు అందగా... కింది స్థాయి నేతలూ అధికారం అండతో కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలుగా జనమ్మీద పడి దోచుకున్నారు. ప్రకృతి వనరులను చెరబట్టారు. ప్రతి పనిలోనూ వాటాలు, ముడుపులు పిండుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములు అన్నతేడా లేకుండా బెదిరించి మరీ వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు.


ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 3,500 ఎకరాలు అక్రమించినట్టు అంచనా. మాజీ సీఎం జగన్‌ బంధువులపైనా ఆరోపణలు ఉన్నాయి. ఇక కొండల్ని మాయం చేశారు. చెరువులు, నదులను గుల్ల చేశారు. పేదల ఇళ్ల స్థలాల చదును పేరిట కోట్లు బొక్కేశారు. గతంలో ఎన్నడూ వినని రీతిలో గత ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఇలా కూడా అవినీతి చేయొచ్చా అని అక్రమార్కులే విస్తుపోయేలా సంపాదించేశారు. దౌర్జన్యాలు, దందాలు, దాడులకు లేక్కేలేదు. రాష్ట్రంలో ఎవరూ ఎదురు చెప్పలేని పరిస్థితి. తవ్వే కొద్దీ అవినీతి లీలలు బయటపడుతూనే ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదంతాలు...

  • సొంత పార్టీ నేతకే మోసం

తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేరుగా సెటిల్మెంట్లలో పాల్గొనకుండా తన మేనల్లుడు, కొందరు రౌడీషీటర్ల ద్వారా నడిపించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులో కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని, సెటిల్‌ చేసి సొంత పార్టీ నాయకుడికే అమ్మేశారు. కొలకలూరులో లాకింగ్‌ బ్రిక్స్‌ పరిశ్రమను కుమారుడి కోసం నిర్మించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేసిన మహిళా నాయకురాలి భర్త అయిన ఓ మైనారిటీ నాయకుడికి ఇందులో వాటా ఉండేది. అయితే ఏమీ ఇవ్వకుండా ఆయన్ను, మిగిలిన భాగస్తులను తరిమేసి కోట్ల విలువైన ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నారు. జగనన్న కాలనీల కోసం పట్టణానికి దూరంగా రూరల్‌ పంచాయతీల పరిధిలో చౌకగా పొలాలు ముందే కొనుగోలు చేసి, వాటిని ప్రభుత్వానికి అమ్మారు. ఎకరం 25 నుంచి 35 లక్షలు పలికే భూములకు 90 లక్షల నుంచి కోటిపైగా రైతుల పేరిట చెల్లింపులు చేసి 180 కోట్లకు పైగా దోచేశారు.

Untitled-4 copy.jpg


  • అక్రమాల్లోనూ పెద్దిరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో నెంబరు టూగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.వేల కోట్లను వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలను బెదిరించారు. గనుల్ని లాక్కున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములని తేడా లేకుండా వందల ఎకరాల్ని కబ్జా చేశారు. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద పలువురి క్వారీలను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు చెందిన జనసేన నాయకుడు రాందాస్‌ చౌదరి, పుంగనూరు టీడీపీ నేత ఆర్వీటీ బాబులకు చెందిన క్వారీలను లాక్కున్నారు. పుంగనూరు మండలం రాగానిపల్లెలో రూ.100 కోట్ల విలువ చేసే 982 ఎకరాల అనాధీన భూముల్ని.. పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులకు అప్పటి అధికారులు కట్టబెట్టేశారు. కుప్పం నియోజకవర్గాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డికి క్వారీల నుంచి నెల మామూళ్లు వెళ్లేవని ప్రచారం జరిగింది. మదనపల్లె బి.కె.పల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 552లో వివాదాస్పదమైన విలువైన భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు వి.మాధవరెడ్డి ఆక్రమించారు. ఇందులో తాము కొనుగోలు చేశామని చెబుతున్న భూమి అయిదు ఎకరాలు అయితే, మరోమూడు ఎకరాలు ప్రభుత్వ, డీకేటీ భూములను ఆక్రమించి కంచె ఏర్పాటు చేశారు. పుంగనూరు బైపాస్‌ రోడ్డు వద్ద పెద్దిరెడ్డి తమ్ముడు, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి బినామీ పేర్లతో తక్కువ ధరలకు బలవంతంగా భూముల్ని కొనుగోలు చేశారు. పులిచెర్ల మండలంలో మామిడి తోటల యజమానుల్ని బెదిరించి ఆక్రమించుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ద్వారకనాథరెడ్డి అనుచరులు ఎక్కువగా కురబలకోట, అంగళ్లు, ముదివేడు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌లో భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి.

Untitled-3 copy.jpg


  • కార్మికుల శ్రమ దోపిడీ

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ కియా కార్ల పరిశ్రమలో తుక్కుతో మొదలుకుని కార్మికుల శ్రమను కూడా దోచుకున్నారు. కియాతో పాటు అనుబంధ సంస్థల్లో గత ఐదేళ్లూ శంకర్‌నారాయణ, ఆయన సోదరులు బినామీల పేరిట దోపిడీకి పాల్పడ్డారు. అనుబంధ పరిశ్రమలో కార్మికులను నియమించే కాంట్రాక్టు ఏజెన్సీలను బినామీల పేరిట నడిపించారు. ఒక్కొక్క కార్మికుడికి అందే వేతనం నుంచి నెలకు రూ.2వేల దాకా దండుకున్నారు. బాధితుల్లో 150 మందికిపైగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. తుక్కు ద్వారా నెలకు రూ.2 కోట్లకుపైగా నొక్కినట్లు సమాచారం. టీ కప్పులు మొదలు భోజనాల ఏజెన్సీలను వారే నడిపించి కమీషన్లు దండుకున్నారు. అప్పట్లో ఏపీ కంటే కర్ణాటకలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.10 వరకూ తక్కువగా ఉండటంతో బస్సులు, కంటైనర్లకు అక్కడి నుంచి డీజల్‌ ట్యాంకర్లను తెప్పించి సొమ్ములు వెనకేసుకున్నారు. చివరకు గాలిమరలలో కూడా దోపిడీకి పాల్పడ్డారు. పెనుకొండ మండలం చంద్రగిరికి చెందిన మధు అనే వ్యక్తి స్థలాన్ని అధికారులను అడ్డు పెట్టుకుని లాగేసుకున్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితుడు ఈ నెల 3న ఫిర్యాదు చేశాడు.

ఇసుక కాంట్రాక్టరు ఆత్మహత్య

గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకలో అడ్డగోలుగా దోచుకున్నారు. గోదావరి నదిని గుల్ల చేసేశారు. తాడేపల్లికి నెలవారీ కప్పం కట్టేలా ఒప్పందం చేసుకుని, అనధికారికంగా ఇసుక తవ్వకం పనులు అప్పగించారు. కొవ్వూరులో నెలకు రూ.25 కోట్లు ఇచ్చేలా ప్రేమ్‌రాజు అనే వైసీపీ నేతకు కాంట్రాక్టు ఇచ్చారు. కొన్నాళ్లు లాభసాటిగా ఉన్నా తర్వాత వైసీపీ పెద్దలు అడిగినంత కప్పం ఆయన కట్టలేకపోయారు. చివరకు వేధింపులు భరించలేక రైలు పట్టాలపై తల పెట్టి బలవన్మరణం చెందారు.

Untitled-3 copy.jpg


  • 50 లక్షలకు చైర్‌పర్సన్‌ పదవి బేరం

మాజీ మంత్రి రోజా అవినీతిలోనూ ఫైర్‌ బ్రాండ్‌ అని నగరి నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. గత ఐదేళ్లూ వసూళ్ల వ్యవహారం ఆమె ఇద్దరు సోదరులు చూసుకునేవారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తానని ఆశ చూపి రోజా సోదరుడు తన నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారని వైసీపీకే చెందిన పుత్తూరు కౌన్సిలర్‌ భువనేశ్వరి ఆరోపించడం అప్పట్లో దుమారం రేపింది. ఆమె తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆధారాలతో సహా ఆరోపణలు చేసింది. తర్వాత ఆమెకు అంతో ఇంతో ఇచ్చి సర్దుబాటు చేసుకున్నారు. విజయపురం మండలంలో ఏకంగా 300 ఎకరాల ప్రభుత్వ భూములను రోజా తన అనుచరుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో బయట పెట్టడంతో ఉన్నతాధికారులు ఆ భూముల్ని వెనక్కి తీసుకుని నలుగురు రెవెన్యూ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వడమాలపేట అంజరమ్మ కనుమ వద్ద 12 ఎకరాల భూమిని బినామీ పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఇందులో రూ.7 కోట్లు సంపాదించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇండస్ర్టియల్‌ పార్కుకు భూముల సేకరణలోనూ కోట్లలో సొమ్ము చేసుకున్నారు.

Untitled-3 copy.jpg


  • గుర్రాల కోట

దోపిడీ చేయడంలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిది ప్రత్యేక స్టైల్‌. రోజూ ఉదయం ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ ప్రజలను పలకరించిన ఆయన విలువైన భూములను కబ్జా చేశారు. ధర్మవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లలోని 25 ఎకరాల భూములను రైతులను బెదిరించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన తమ్ముడు కేతిరెడ్డి వెంకటక్రిష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉంది. ఈ భూములను ఆనుకుని ఉన్న 20.61 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించి కలిపేసుకున్నారు. ఇందులో విలాసవంతమైన ఫాంహౌస్‌, రేసింగ్‌ ట్రాక్‌, గుర్రాల కోసం ప్రత్యేక షెడ్లు, సేద తీరడానికి చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని గుర్రాల కోట అని జిల్లా ప్రజలు పిలుస్తున్నారు. ధర్మవరం మండల పరిధిలోని 106 ఎకరాల సోలార్‌ భూములను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన అనుచరుల అక్రమాలకూ లేక్కేలేదు. చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి పక్కన 20 ఎకరాల దళితుల భూములను, వారిని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. చెన్నేకొత్తపల్లిలో వందేళ్లకు పైగా ఉన్న ప్రధాన రహదారిని కబ్జా చేశారు. ముదిగుబ్బ మండలంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రధాన అనుచరుడు మండల కేంద్రం చుట్టూ ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూములను స్థానిక నాయకులతో కలిసి కబ్జా చేశారు. అనంతపురం-కదిరి జాతీయ రహదారి పక్కన 6 ఎకరాల గుట్టను వైసీపీ నేతలు రాత్రికిరాత్రే ఆక్రమించి చదును చేశారు.

Untitled-3 copy.jpg


  • అసైన్డ్‌ భూములను మింగేసిన ఉష శ్రీచరణ్‌

మాజీ మంత్రి ఉష శ్రీచరణ్‌ పేదలను భయపెట్టి అసైన్డ్‌ భూములు లాగేసుకున్నారు. తక్కువ ధరతో వందల ఎకరాలు సేకరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని 217, 219, 220, 222, 223, 224, 225, 226 సర్వే నంబర్లలో అసైన్డ్‌ భూములను కొనేందుకు రైతులతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు. కంబదూరు-కనగానపల్లి సరిహద్దు మండలాల్లో 124, 125, 127 సర్వే నంబర్లలో 165 ఎకరాలను అతి తక్కువ ధరకే రైతులను బెదిరించి లాక్కున్నారు. ఇందులో 33 ఎకరాలు గాలిమరలకు సంబంధించిన భూమి ఉండడంతో ఆ కంపెనీ ప్రతినిధులను బెదిరించి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు.

  • జగన్‌ బంధువుల అక్రమాలు

  1. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని తాళ్లమాపురం గ్రామంలో రూ.100 కోట్ల విలువ చేసే 20 ఎకరాల ప్రైవేటు భూములను ఆన్‌లైన్‌ చేసుకున్నారు. ఈ డీల్‌లో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, స్థానిక వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం ఉంది.

  2. పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్‌ బంధువు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి తొండూరు, మల్లెల గ్రామాల్లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బినామీ పేర్లతో ఆన్‌లైన్‌ చేసుకున్నారు. ఈయన తొండూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.

  3. కమలాపురం నియోజకవర్గంలోని పాలెంపల్లె, రూకవారిపల్లెకు చెందిన యానాదులకు వెట్టిచాకిరి కింద పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో 470 ఎకరాల భూములు ఇచ్చారు. వాటిలో 150 ఎకరాలు జగన్‌ బంధువు పేరిట ఉన్నట్లు చెబుతున్నారు.

Untitled-3 copy.jpg


  • 1000 కోట్ల పిన్నెల్లి

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి, అరాచకాలు, హింస అంతా ఇంతా కాదు. గత ఐదేళ్లలో తక్కువలో తక్కువ రూ.1000 కోట్ల వరకు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై దాడులు చేయించి గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. దుర్గి, వెల్దుర్తి మండలాల్లో పలు హత్యలకు సంబంధించి ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. వెల్దుర్తి మండలంలో చంద్రయ్య, దుర్గి మండలంలో జల్లయ్య హత్యలు ఈ కోవకు చెందినవే. పిన్నెల్లి అరాచకాలను ప్రశ్నించేందుకు వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై దాడి చేసిన తురకా కిషోర్‌కు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. మాచర్ల పట్టణంలో టీడీపీ దివంగత నేత వీరమాచినేని సుభా్‌షచంద్రబో్‌సకు చెందిన 10 సెంట్ల స్థలంలో గల ఇల్లు, పెట్రోలు బంకు, బంకు సమీపంలోని స్థలాలు, నెహ్రూనగర్‌లోని ఎకరం స్థలానికి అక్రమ దస్తావేజులు పుట్టించి కాజేశారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్ల పైనే ఉంటుంది. రింగురోడ్డులోని టీడీపీ నేత నిమ్మగడ్డ వాసుకు చెందిన హెచ్‌పీ పెట్రోల్‌ బంకును దౌర్జన్యంగా ఆక్రమించారు.

కొత్తపల్లి జంక్షన్‌, స్టేడియం, రాయవరం జంక్షన్‌, వినాయకుని గుట్ట తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేయించి సొమ్ము చేసుకున్నారు. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని దస్తావేజులు పుట్టించి కాజేశారు. వెల్దుర్తి మండలంలో 500 ఎకరాలు, దుర్గి మండలం గజాపురం సమీపంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని మింగేశారు. బియ్యం, మద్యం, ఇసుక, గ్రానైట్‌, జగనన్న ఇళ్ల స్థలాలకు భూములు కొనుగోలు... ఇలా ప్రతి దాంట్లో వేలు పెట్టి ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లను బెదిరించి 20-30 శాతం వరకు కమీషన్‌ దండుకున్నారు. పోలింగ్‌ రోజున పిన్నెల్లి అనుచరులు నానా బీభత్సం సృష్టించారు.


  • జడ్జి తల్లి భూమి కబ్జా

మాజీ మంత్రి జోగి రమేశ్‌ బినామీ జడ్జి తల్లి భూమినే కబ్జా చేశాడు. కృష్ణా జిల్లా పెడన మండలం కొంకేపూడి గ్రామంలో జడ్జి తిరుమలరావుకు 5.30 ఎకరాల పొలం ఉంది. ఆయన 2021లో కొవిడ్‌తో మరణించారు. ఆ తర్వాత తిరుమలరావు భార్యకు, తల్లికి ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ అనుచరుడైన పామర్తి సాంబశివరావు అలియాస్‌ డొకోమో సాంబ ఈ వివాదంలో జోక్యం చేసుకుని 2022 డిసెంబరులో ఇందులో 1.30 ఎకరాల భూమిని తన తండ్రి అర్జునరావు పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇక జోగి రమేశ్‌ కుటుంబం విజయవాడ రూరల్‌ మండలం అంబాపురంలో ఏకంగా సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రి గోల్డ్‌ భూములనే కబ్జా చేసేసింది.

Untitled-3 copy.jpg


  • బెదిరించి థియేటర్‌ సొంతానికి...

గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న శరత్‌ థియేటర్‌లో కేవలం ఒక వాటా కలిగి ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని దాన్ని ఏకంగా సొంతం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు వాటాదారులను బెదిరించి దాదాపు పదేళ్లుగా తన ఆధీనంలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల అసలు వాటాదారులు ముందుకొచ్చి తమ థియేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ప్లాట్లు, భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుడివాడలో స్థానిక టీచర్స్‌ కాలనీలోని అక్షర స్కూల్‌కు చెందిన 1,600 గజాల స్థలాన్ని సెటిల్‌మెంట్‌ పేరుతో ఆక్రమించుకున్నారు. దాన్ని నాని ముఖ్య అనుచరుడు కొల్లి విజయ్‌ పేరుతో ది గుడివాడ అర్బన్‌ బ్యాంకులో తనఖా పెట్టారు. నందివాడ మండలం పుట్టగుంట వద్ద పాఠశాలకు చెందిన ఖాళీస్థలంతో పాటు మరికొందరు వ్యక్తులకు చెందిన 7.75 ఎకరాల పొలాలను ఆక్రమించుకుని చెరువు తవ్వేశారు. కబ్జా చేసిన వాటిలో ఆలయాల భూములు కూడా ఉన్నాయి.

Untitled-2 copy.jpg


  • బెదిరించి.. కేసులు పెట్టి..

రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్‌ మండలం పులకుర్తికి చెందిన రైతు రామాంజినేయులురెడ్డికి చెందిన రూ.కోటి విలువైన 11 ఎకరాల భూమిని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన బినామీల పేరుతో సొంతం చేసుకున్నారు. ఆ రైతు, ఆయన కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కేసుల పేరిట బెదిరించారు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేయించి నానా ఇబ్బందులకు గురి చేశారు. ఆర్థిక అవసరాల రీత్యా రామాంజినేయులురెడ్డి పూర్వీకులు బళ్లారిలో ఓ వ్యాపారి వద్ద ఆ భూమి తాలూకా డాక్యుమెంట్లు గతంలో తాకట్టుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి తన అనుచరులను రంగంలోకి దించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రికార్డులు మార్పించారు. అడ్డు వచ్చిన బాధిత రైతు, అతని కుటుంబ సభ్యులపై దాడులు చేయించారు. రామాంజినేయులురెడ్డి కుమారుడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయించడంతో అతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

Untitled-2 copy.jpg


  • డిస్టిలరీలు కబ్జా

మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్‌ సీఎం కాగానే ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిపించారు. కప్పం కట్టని బ్రాండ్‌ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. రాష్ట్రంలోని డిస్టిలరీలను బలవంతంగా లాక్కొన్నారు. సొంత బ్రాండ్లను సృష్టించారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం బ్రాండ్లను అమ్మించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. తాడేపల్లికి రూ.3100 కోట్లు ముడుపులు అందినట్టు ప్రభుత్వ ప్రాథమిక అంచనా. కూటమి ప్రభుత్వం రాగానే మద్యం పాలసీని మార్చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కప్పం కట్టాల్సిన పని లేకపోవడంతో మద్యం ధరలు తగ్గించడంతో పాటు మళ్లీ పాత బ్రాండ్లు వచ్చాయి.

_ copy.jpg

Updated Date - Dec 09 , 2024 | 12:14 PM