Varla Ramaiah: జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట
ABN , Publish Date - Dec 26 , 2024 | 06:32 PM
Varla Ramaiah:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంచి ఫ్యామిలీ మెన్, బిజినెస్ మెన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు.
అమరావతి, డిసెంబర్ 26: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మరోసారి మండిపడ్డారు. గురువారం అమరావతిలో వర్ల రామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన అంతా అవినీతిమయమని అభివర్ణించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట అని పేర్కొ్న్నారు. వైఎస్ జగన్ అవినీతి వలన ప్రజలపై రూ. లక్షా 29 వేల కోట్లు విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం.. జగన్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా? అంటూ వైఎస్ జగన్‌కు వర్ల రామయ్య సవాల్ విసిరారు.
ఎవరి మీద ధర్నా చేస్తావంటూ సూటి ప్రశ్న..
వైఎస్ జగన్ ధర్నా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడ్డారు. ఎవరి మీద ధర్నా చేస్తావు నువ్వు అంటూ జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మీరు చేసిన అవినీతి పరిపాలన మీద ధర్నా చేసుకుంటావా? అంటూ వైసీపీ అధినేతను ఈ సందర్భంగా నిలదీశారు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసారెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వలనే జన్ కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. మొత్తంగా 1,29,503 కోట్ల నష్టంతో.. నేడు ప్రజలపై ఈ విద్యుత్ భారం పడిందన్నారు. మీ పాలనలో ఏదైనా ఒక్క కొత్త విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారా? అంటూ జగన్ రెడ్డిని బల్లగుద్ది మరి ప్రశ్నించారు.
విద్యుత్ వెలుగులకు ఆద్యుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడని ఈ సందర్బంగా వర్ల రామయ్య గుర్తు చేశారు. 1995 – 2024 చంద్రబాబు పాలనలో 5 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పిని పెంచారన్నారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం అంటే.. 2014 -2019లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9,463 మెగావాట్లు పెంచారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో చంద్రబాబు పెంచిన విద్యుత్ ఉత్పత్తే 15 వేల మెగావాట్లని ఈ సందర్భంగా వర్ల రామయ్య వివరించారు.
Also Read: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం
బహిరంగ చర్చకు సవాల్..
రాష్ట వ్యాప్తంగా 21 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని తెలిపారు. మీ ఐదేళ్ల పాలనలో ఒక్క వీధి దీపమైన పెట్టారా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అంటూ మరోసారి జగన్ రెడ్డికి వర్ల రామయ్య సూటిగా సవాల్ విసిరారు. 1998లో ఏపీలో విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకు వచ్చిందే చంద్రబాబు నాయుడన్నారు.
Also Read: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు
ఇది మీ పాపం కాదని చెప్పే ధైర్యం ఉందా?
అయితే మీ పాపాన్ని నాడు ఏసు ప్రభువు శిలువ మోసినట్లు నేడు చంద్రబాబు మోస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో.. మీరు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. నాడు మీరు మార్కెట్‌లో విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోళ్లు చేసి 2022-23లో రూ. 6,072 కోట్లు, 2023-24 లో రూ. 9,412 కోట్లు ప్రజలపై భారం మోపింది.. మీరు కాదా జగన్ రెడ్డి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ పాపం కాదని చెప్పే ధైర్యం మీకు ఉందా? అని వైసీపీ అధినేతను ఆయన ప్రశ్నించారు.
Also Read: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?
ఆర్కే రోజా వ్యాఖ్యలపై స్పందించిన వర్ల రామయ్య..
ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌రెడ్డిని బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్‌గా సక్సెస్ అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు. అవునండి వైఎస్ జగన్ మంచి బిజినెస్ చేసి రూ. 43 వేల కోట్ల ప్రజాధనం కొట్టేశారని సీబీఐ సైతం చెప్పిందని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
తల్లిని, చెల్లిని, బాబాయి కూతుర్ని, బాబాయిని, బామ్మర్థులను కాదన్న ఈయన ఏ విధంగా ఫ్యామిలీ మెన్ ? అంటూ ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై సందేహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ అంటే జగన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డిగారేనా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఫ్యామిలీ అంటే చంద్రబాబు ఫ్యామిలా ఉండాలని వర్ల రామయ్య ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు సూచించారు.
For AndhraPradesh News And Telugu News