Share News

Amaravati: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళి సైపై అమిత్ షా సీరియస్

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు.. అదే వేదికపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు.

Amaravati: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళి సైపై  అమిత్ షా సీరియస్

అమరావతి, జూన్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కొన్ని నిమిషాల ముందు అదే వేదికపై ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక సందర్భంలో సీరియస్‌గా కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ఇంతకీ విషయం ఏంటంటే.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన ఆమె కేంద్ర పెద్దలను పలకరిస్తూ తన సీటు వైపు వెళ్లసాగారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచి మాట్లాడారు.

sai.jpg


తమిళిసైతో మాట్లాడుతూ అమిత్ షా కాస్త సీనియస్‌గా వేలిని చూపిస్తూ ఏవో ఆదేశాలు ఇస్తున్నట్టుగా అనిపించింది. అయితే తమిళిసై మాత్రం నవ్వుతూనే అమిత్ షాకు సమాధానం ఇవ్వడం కనిపించింది. అమిత్ షా మాత్రం చేతిని అడ్డంగా ఊపుతూ కనిపించారు. ఆమెతో సీరియస్‌గా మాట్లాడారు. ఈ ఇద్దరి సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెన్నై దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళి సై బరిలో నిలిచారు. అయితే ఆమె ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ తన సత్తా చాట లేకపోయింది. ఆ క్రమంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, తమిళి సై మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని టాక్ వినిపిస్తోంది. ఈ పంచాయితి ఢిల్లీ పెద్దలకు చేరినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే తమిళనాడు బీజేపీ శ్రేణులతో ఢిల్లీ పెద్దల భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళిసైతో అమిత్ షా సీరియస్‌గా మాట్లాడడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


మరోవైపు అమిత్ షా సీరియస్ అయిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డీఏంకే పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలిని ఇలా బహిరంగంగా మందలించడం మర్యాదగా ఉందా? ఇది అందరూ చేస్తారనే విషయాన్ని అమిత్ షా తెలుసుకోవాలన్నారు. అయినా ఇది ఏ తరహా రాజకీయమంటూ ఆయన ఎక్స్ వేదికగా అమిత్ షాను ప్రశ్నించారు.

ఇక తమిళి సై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో తమిళిసైపై అన్నామలై మద్దతుదారులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 05:17 PM