Vijayawada : జర్నలిస్టులపై దుర్భాషలా?
ABN , Publish Date - Jul 19 , 2024 | 05:32 AM
మీడియా సంస్ధల అధినేతలు, జర్నలిస్టులను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ధ్వజమెత్తాయి.
విజయసాయిపై జర్నలిస్టు సంఘాల మండిపాటు
విజయవాడ (ధర్నాచౌక్), జూలై 18: మీడియా సంస్ధల అధినేతలు, జర్నలిస్టులను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ధ్వజమెత్తాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉండి జర్నలిస్టులను దుర్భాషలాడటం సిగ్గుచేటని పలువురు వక్తలు మండిపడ్డారు.
సాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాల జేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో గురువారం మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అనేక కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తికి మీడియా యాజమాన్యాలను విమర్శించే అర్హత లేదన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నేతలు నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, టీడీపీ రాష్ట్ర నేత బ్రహ్మం, బీజేపీ నగర నేత ఎన్.వెంకట్, జర్నలిస్టు సంఘాల నేతలు షేక్ బాబు, చావా రవి,, దారం వెంకటేశ్వరరావు, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.