Vijayawada : బెజవాడలో భారీ వాన
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:23 AM
విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంట సేపు కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలం
గంటపాటు దంచికొట్టిన వర్షం.. నగరం అతలాకుతలం
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు.. చెరువుల్లా మారిన రహదారులు
గంటసేపు దంచికొట్టిన వాన
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
చెరువుల్లా మారిన రహదారులు
విజయవాడ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంట సేపు కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ రోడ్డులో వర్షం నీరు నిలిచిపోయిన ప్రాంతాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. భవిష్యత్తులో వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే ప్రధాన రహదారులను క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి.. అధికారులకు సూచనలు చేశారు.
అక్కడక్కడా భారీ వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ రూరల్‌లో 83, ఏలూరు జిల్లా నిడమర్రులో 80, విజయనగరంలో 70, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 48.5, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 47.5, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.