Share News

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:30 AM

‘విశాఖపట్నం కంటెయినర్‌ డ్రగ్స్‌’ కథ కంచికి చేరింది. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్‌లో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ కొకైన్‌) ఉన్నాయని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

  • డ్రై ఈస్ట్‌లో ‘మత్తు’ లేదని ల్యాబ్‌ నివేదిక?

  • కిట్‌తో పరీక్షించినపుడు పాజిటివ్‌...

  • ప్రయోగశాల పరీక్షలో నెగెటివ్‌

  • కంటెయినర్‌ విడుదల చేయాలని సీబీఐ లేఖ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘విశాఖపట్నం కంటెయినర్‌ డ్రగ్స్‌’ కథ కంచికి చేరింది. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్‌లో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ కొకైన్‌) ఉన్నాయని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యేంత వరకు కంటెయినర్‌ను తీసుకువెళ్లకూడదంటూ అక్కడే ఉంచారు. కంటెయినర్‌ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్‌ నమూనాలను సెంట్రల్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపించారు. అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు(డ్రగ్స్‌) లేవని నివేదిక వచ్చినట్టు సమాచారం. అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో సమర్పించి, కేసును మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు. దానికి న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఆ కంటెయినర్‌ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్‌ అధికారులకు 10 రోజుల క్రితం లేఖ రాశారు. ఇదే విషయాన్ని కస్టమ్స్‌ అధికారులు కంటెయినర్‌ యజమాని అయిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు తెలియజేయగా వారు ఇంతవరకూ స్పందించలేదు. ‘మేం తెప్పించుకున్న సరకును 9 నెలలు ఉంచేసుకున్నారు. అది ఇప్పుడు వాడడానికి పనికి రాదు. తీసుకొని ఏమి చేయాలి?’ అని వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.


ఆ రోజు ఏమి జరిగిందంటే..?: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ను బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మార్చి 18న ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాలపై వచ్చి విచారణ ప్రారంభించారు. విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ రొయ్యల మేతగా ఉపయోగించే ‘డ్రై ఈస్ట్‌’ను బ్రెజిల్‌ నుంచి కంటెయినర్‌(ఎస్‌ఈకేయు4375380) ద్వారా తెప్పించుకోగా అందులో డ్రగ్స్‌ ఉన్నాయని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఆ కంపెనీ యాజమాన్యం ముందే కంటెయినర్‌ తెరిచారు. 25 కిలోల బరువున్న వేయి సంచులతో డ్రై ఈస్ట్‌ రాగా, దాదాపుగా అన్ని సంచులను పరిశీలించి నమూనాలు తీసుకున్నారు. వెంట తెచ్చుకొన్న కిట్‌తో డ్రగ్స్‌ కలిశాయా? లేదా? అని పరిశీలించారు. ప్రాథమిక పరీక్షలో కొకైన్‌ ఉన్నట్టు తేలడంతో కంటెయినర్‌ని సీజ్‌ చేశారు. ఆ తరువాత సంస్థ ప్రతినిధుల కాల్‌ డేటా సేకరించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఇదే సంస్థకు చెందిన అకౌంటింగ్‌ పుస్తకాలతో ఒక వ్యాన్‌ తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులకు పట్టుబడింది. సంధ్యా ఆక్వాలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్‌ లేవని తేల్చారు.

Updated Date - Dec 07 , 2024 | 04:31 AM