ఉక్కు సీఎండీ... అభినవ నీరో..!
ABN , Publish Date - Aug 20 , 2024 | 06:19 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీ అతుల్ భట్ అభినవ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే... నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు... ఇక్కడ ఈయన కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు.
పీకల్లోతు కష్టాల్లో స్టీల్ ప్లాంటు
ఉత్పత్తికి ముడిపదార్థాలు లేవు...
3 బ్లాస్ట్‌ఫర్నేస్‌ల్లో రెండు షట్ డౌన్
19వ తేదీ వచ్చినా జీతాల్లేవు
అడ్డగోలు దారిలో పదవిలోకి వచ్చిన ఉన్నతాధికారికి అదేమీ పట్టని వైనం
స్వాతంత్య్ర వేడుకల వేదికపై ‘పుష్ప’ సినిమా పాటకు డ్యాన్సు
ఆయన్ను తక్షణమే మార్చాలని డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సీఎండీ అతుల్ భట్ అభినవ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే... నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు... ఇక్కడ ఈయన కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీ వచ్చినా ఉద్యోగులకు ఇప్పటివరకూ జూలై నెల జీతాలు ఇవ్వలేదు. జూలై 31న పదవీవిరమణ చేసిన వారికి ఇంకా సెటిల్‌మెంట్ చేయలేదు. మరోవైపు ముడి పదార్థాలు అందుబాటులో లేక మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో రెండు మూతపడ్డాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ అరకొరగానే నడుస్తోంది.
ఎక్కడా అప్పు పుట్టడం లేదు. విదేశాల నుంచి తెప్పించుకున్న బొగ్గు పోర్టుల్లో మూలుగుతోంది. రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో షిప్పింగ్ ఏజెంట్లు కోర్టు అటాచ్‌మెంట్లు తెచ్చుకొని ఆపేశారు. ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా? అని ఆలోచించాల్సిన సీఎండీ... తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీలైనప్పుడల్లా వేదికలు ఎక్కి హుషారుగా డ్యాన్సులు చేస్తున్నారు. జీతాలు అందక కడుపు మంటతో రగిలిపోతున్న ఉద్యోగుల ముందే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉక్కు క్లబ్‌లో సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి ఆహ్వానించింది. ఆ వేదిక ఎక్కిన ఆయన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల గురించి మాట్లాడకుండా ‘పుష్ప’ సినిమాలో పాటకు హుషారుగా డ్యాన్సు చేశారు. ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేదనే చింత ఆయనలో ఇసుమంతైనా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి వ్యక్తిని తక్షణం ఇక్కడి నుంచి పంపించేసి, చిత్తశుద్ధితో ప్లాంటు కోసం పనిచేసే అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆయన వచ్చిందే అడ్డదారి...
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో సీఎండీ పోస్టు భర్తీకి ఓ విధానం ఉంది. డైరెక్టర్ లేదా సీఎండీ పోస్ట్టు ఆరు నెలల్లో ఖాళీ అవుతుందని తెలియగానే నోటిఫికేషన్ ఇస్తారు. దరఖాస్తుదారుల్లో కనీసం ఐదుగురితో జాబితా తయారుచేస్తారు. రెండు, మూడు నెలల ముందు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అదేరోజు ఒకరిని ఎంపిక చేస్తారు. ఒక నెల ముందుగానే ఆర్డర్ జారీ చేస్తారు.
సదరు పోస్టులో ఉన్న అధికారి పదవీ విరమణ చేయగానే రెండు, మూడు రోజుల్లో ఎంపిక చేసిన వ్యక్తి బాధ్యతలు చేపడతారు. కానీ అతుల్ భట్ నియామకం అందుకు విరుద్ధంగా జరిగింది. 2021 మే నెలలో నాటి సీఎండీ పీకే రథ్ పదవీ విరమణ చేశారు. సీఎండీగా ఎవరినీ నియమించకుండా 2021 అక్టోబరు వరకు పోస్టు ఖాళీగా ఉంచారు.
అప్పటి కమర్షియల్ డైరెక్టర్ మహంతికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. అదే ఏడాది సెప్టెంబరులో సెర్చ్ కమిటీ పేరుతో ఒకే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి, ఆయన్నే ఇంటర్వ్యూ చేసి సీఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయనే అతుల్ భట్. ఆయనకు ఉక్కు ఉత్పత్తి రంగంలో ఎటువంటి అనుభవం లేదు. అతుల్ స్టీల్‌ప్లాంటులో ఎక్కువ కాలం నాన్ కోర్‌లో పనిచేశారు.
తప్పుడు నిర్ణయంతో లాభాల నుంచి నష్టాల్లోకి...
సీఎండీగా 2021 నవంబరులో బాధ్యతలు చేపట్టిన సమయానికి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నడుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగంలో రూ.1,000 కోట్ల లాభాలతో ఉంది.
ఉత్పత్తిని ఏడు మిలియన్ టన్నులకు పెంచుతానని, అధికారులకు కొత్త ప్రమోషన్ పాలసీ అమలు చేస్తానని, కార్మికులకు వేతన ఒప్పందం చేస్తానని హామీలు ఇచ్చి ఆకర్షించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను వర్కింగ్ కేపిటల్‌కు ఉపయోగించకుండా బ్యాంకుల అప్పులు తీర్చడానికి వాడేశారు. ఆ తప్పుడు నిర్ణయంతో ముడి పదార్థాల కొనుగోళ్లకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి తగ్గిపోయింది.
ఆ సాకుతో మూడో నంబరు బ్లాస్ట్ ఫర్నే్‌స(బీఎ్‌ఫ)ను 2022 జనవరిలో మూసేశారు. ఈ నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించడంతో దానిని మళ్లీ వినియోగంలోకి తెస్తామని హామీలు గుప్పించి జిందాల్ నుంచి రూ.1,500 కోట్లు, టాటా నుంచి రూ.800 కోట్లు తెచ్చారు. వాటిని సద్వినియోగం చేయలేకపోయారు.
తక్కువ ధరకు అదానీలకే ఇవ్వాలనే...
రాయబరేలిలో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటును విజయవంతంగా రైల్వేకు అమ్మేశారు. అప్పులు పోను రావల్సిన రూ.900 కోట్లు బ్యాంకర్ల చేతిలో పెట్టారు. ఆ ప్లాంటు వల్ల స్టీల్‌ప్లాంటుకు చిల్లిగవ్వ కూడా రాలేదు. ఉద్యోగులు, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈయన హయాంలోనే వచ్చింది.
ఈయన మూడేళ్ల పదవీ కాలం నవంబరుతో పూర్తి కావస్తోంది. కొత్త సీఎండీ ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు. ఇంకో ఆరు నెలలు ఇక్కడే అతుల్ భట్‌ను కొనసాగించాలని కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు పేరు చెబితే కొనడానికి ఎవరూ ముందుకు రాని విధంగా చేశారు. తక్కువ రేటుకు అదానీలకు అప్పగించాలని కుట్ర చేస్తున్నారు.