Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రావాలి.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Dec 21 , 2024 | 06:43 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ (శనివారం) పర్యటించారు. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు ఆయన కాలినడకన కొండపైకి వెళ్లారు.
పాడేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అల్లూరి జిల్లాలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ నిధులు రూ.105 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే ప్రతి గిరిజన యువకుడూ భాగమైనట్లేనని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుపడి ఉందని పవన్ చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ (శనివారం) పర్యటించారు. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు ఆయన కాలినడకన కొండపైకి వెళ్లారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఉపముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం వారితో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. అలాగే సంప్రదాయ డోలును వాయించారు.
అభివృద్ధే లక్ష్యం..
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆవేదన, బాధ తెలుసుకునేందుకే అటవీ ప్రాంతంలో పర్యటించా. ఎన్నికలు కోసమో, ఓట్ల కోసం మా ప్రభుత్వం పనిచేయదు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ఉన్నామని కచ్చితంగా చెబుతున్నా. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నాం. గిరిజనుల అన్నీ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నాం. బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో నేడు 19 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించాం. గిరిజన యువత తలుచుకుంటేనే మార్పు సాధ్యం అవుతుంది. ప్రభుత్వం మారింది, పంచాయతీ సర్పంచ్‌లు తలఎత్తుకుని తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాం.
అదే ప్రధాని సంకల్పం..
వంద మంది జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామానికీ రోడ్లు వేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ మహా సంకల్పం. జనవరిలో రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.250 కోట్ల నిధులు ఇవ్వనుంది. అలాగే రోడ్ల నిర్మాణానికి ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తాం. ప్రజల నమ్మకం గెలుచుకోవడానికే ఇక్కడికి వచ్చా. మా ఐదేళ్ల పనితీరు గమనించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు పెట్టకపోతే నేడు ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వచ్చేవి కావు. ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు తెలియదు, కానీ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడం మాత్రం తెలుసు. తిట్లు తిన్నాం, కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినా భరించి నిలబడ్డాం. దాని ఫలితం నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది.
గంజాయి వదిలేయండి..
గంజాయిని సామాజిక సమస్యగా చూడాలి. గిరిజన ఆచార వ్యవహారాలు దాటి గంజాయి కమర్షియల్ అయ్యింది. యువత, పిల్లలు చెడిపోవడానికే అదే కారణం. కడపలో ఇటీవల విద్యార్థులు దాన్ని సేవించి మత్తులో టీచర్‌పై దాడి చేసి దారుణంగా ప్రవర్తించారు. గంజాయి సాగు వదిలేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. ఈ మత్తుపదార్థం గ్రామాలను దాటి ఎగుమతి అయ్యే వరకూ వెళ్లడంతో ఏపీ గంజాయికి క్యాపిటల్‌గా మారింది. గంజాయిని మీరు వదిలే వరకూ నేను మిమ్మల్ని వదలను.
సినీ పరిశ్రమ రావాలి..
గిరిజన ఆచార వ్యవహారాలు నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మంచి పని చేసే వాడికి ఆపద ఉండదు, ఉండకూడదు. దీన్ని నేను బలంగా నమ్ముతా. సినిమా కోసం నేనెప్పుడూ కల కనలేదు. దేశం, ప్రజల కోసం కలలు కన్నా. మనసు, బుద్ధి కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావాలి. విదేశాల్లో ఉండే చాలా సుందరమైన ప్రదేశాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి చోట షూటింగ్‌లు చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Atchannaidu: నేను తలుచుకుంటే ఒక్కడూ మిగడు.. అచ్చెన్న మాస్ వార్నింగ్
Ram Gopal Varma: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మరో షాక్..