తూర్పు మణిహారం విశాఖ
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:38 AM
తూర్పు తీరానికి మణిహారం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది.
త్వరలో థియేటర్ లెవెల్ కమాండ్.. త్రివిధ దళాల కేంద్రంగా సాగర నగరం
తూర్పు నౌకాదళం ఇటీవల స్టార్ ఎస్-4 అణు జలాంతర్గామిని ప్రారంభించడంతో విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. రెండు నెలల క్రితమే ఐఎన్ఎస్ అరిఘాత్ సేవలను ప్రారంభించగా,
ఆ వెంటనే అత్యంత వేగంగా స్టార్ ఎస్-4 జలప్రవేశం చేయడంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖలో తయారు చేసిన మూడో అణు జలాంతర్గామి ఇది. మన దేశ రక్షణ రంగంలోనే తూర్పు నౌకాదళం అత్యంత వ్యూహాత్మకమైనది.
సమన్వయంతో ఉమ్మడి ఆపరేషన్లు
దేశ రక్షణలో తూర్పు నేవీ కీలకపాత్ర
‘సిటీ ఆఫ్ డెస్టినీ’కి ఎన్నెన్నో ప్రత్యేకతలు
3 అణు జలాంతర్గాముల తయారీ
2 నెలల వ్యవధిలోనే 2 జలప్రవేశం
ప్రతి రెండేళ్లకోసారి ‘మిలాన్’
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తూర్పు తీరానికి మణిహారం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా సైనిక దళం (ఆర్మీ), విశాఖలో తూర్పు నౌకాదళం ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ కేంద్రం ఉన్న ఏకైక నగరంగా విశాఖ నిలిచింది. అమెరికా, చైనా దేశాల మాదిరిగా త్రివిధ దళాలు కలిసి ఒక్కచోటే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ‘థియేటర్ లెవెల్ కమాండ్’లను ఏర్పాటు చేయనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడూ ఒక్కచోటే ఉండి సమన్వయంతో పనిచేస్తూ ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహిస్తాయి. అలాంటి థియేటర్ లెవెల్ కమాండ్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతున్నది.
హెచ్‌ఎ్‌సఎల్, బీడీఎల్...
రక్షణ శాఖ పరిధిలోని రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎ్‌సఎల్). మరొకటి ఆటోనగర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెట్ (బీడీఎల్). షిప్‌యార్డ్‌లో నేవీకి అవసరమైన నౌకలు నిర్మితమవుతుండగా, బీడీఎల్‌లో రక్షణ శాఖకు అవసరమైన పరికరాలు తయారవుతున్నాయి.
నేవల్ లేబొరేటరీ...
రక్షణ శాఖకు పరిశోధనలు చేసే డీఆర్డీఓకు దేశంలో 24 లేబొరేటరీలు ఉండగా అందులో విశాఖపట్నం అతి ప్రధానమైనది. అదే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ (ఎన్‌ఎ్‌సటీఎల్). నేవీకి సంబంఽధించిన రాడార్లు, సోనార్లు, టార్పెడోలు ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. వరుణాస్త్రకు ఇక్కడే రూపకల్పన చేశారు. అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇతర సంస్థలకు బదిలీ చేసి భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో కొన్నింటిని విదేశాలకు కూడా విక్రయిస్తుంటారు.
నిరంతరం దేశ రక్షణలో...
మెరైన్ కమెండోలకు శిక్షణ ఇచ్చేందుకు భీమిలి సమీపాన ఐఎన్ఎస్ కర్ణ... సబ్మెరైన్లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు ఐఎన్ఎస్ శాతవాహన... నౌకా నిర్మాణంలో ఆర్కిటెక్చర్, హల్ మౌంట్, సెయిలర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఐఎన్ఎస్ విశ్వకర్మ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇక ఐఎన్ఎస్ డేగాలో జెట్ ఫైటర్లు, మిగ్ 29-కేలపై శిక్షణ ఇస్తున్నారు.
చెరగని ముద్ర
కేంద్రప్రభుత్వవిధానాలు అమలుచేయడంలో తూర్పు నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోంది. యూపీఏ ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్ పాలసీ’ అమలు చేసినపుడు తూర్పు తీర దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించింది. ఆ తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా మార్చింది. తూర్పు దేశాలతో స్నేహమే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక బంధాలు బలోపేతం చేయాలన్నది దీని ఉద్దేశం. దీనిని అమలు చేయడానికి 2022లో మిలాన్ పేరుతో అతి పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత ఈఏడాది ఫిబ్రవరిలో నిర్వహించినప్పుడు 50 దేశాలు పాల్గొన్నాయి. విశాఖ కేంద్రంగా ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అంతకుముందు 2006లో ప్రెసిడెంట్ఫ్లీట్రివ్యూ నిర్వహించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో
భారత నౌకాదళం తొలుత రష్యా నుంచి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రను లీజుకు తీసుకుంది. ఆ తరువాత విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో స్వదేశీ పరిజ్ఞానంతో అణు జలాంతర్గాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదట ఐఎన్ఎస్ అరిహంత్‌ను నిర్మించింది. ఇది 2016లో నేవీలో చేరి సేవలు అందిస్తోంది. రెండు నెలలక్రితం ఆగస్టు 29న ఐఎన్ఎస్ అరిఘాత్ అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని నేవీలో చేరింది.
విశాఖ ప్రత్యేకతలు ఇవీ..
‘సిటీ ఆఫ్ డెస్టినీ’గా పేరున్న విశాఖకు ఉన్న ప్రత్యేకతలే దేశ రక్షణలో కీలకంగా నిలిచేలా చేస్తున్నాయి. విశాఖ నగర నిర్మాణం చాలా భిన్నమైనది. మూడు వైపులా కొండలు, మరోవైపు సముద్రం ఉంటాయి. మధ్యలో నగరం. దీనిని పర్యావరణ శాస్త్రవేత్తలు ‘బౌల్’ ఆకారంలోని నగరంగా అభివర్ణిస్తారు. భారతదేశానికి వలస వచ్చిన ఆంగ్లేయులు నాడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం సముద్ర వ్యాపార కేంద్రానికి అనువుగా ఉంటుందని గుర్తించారు. నౌకలు లంగరు వేసుకోవడానికి సహజ సిద్ధమైన తీరప్రాంత అమరిక ఉండడంతో పోర్టు నిర్మాణం, ఆ తరువాత దేశ రక్షణ కోసం నౌకాదళం ఏర్పాటయ్యాయి.
అతిపెద్ద సంస్థ
దేశంలో భౌగోళికంగా అది పెద్దది విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళమే. దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు ఉన్నాయి. బంగాళాఖాతంతో పాటు హిందూ మహా సముద్రంలో సగభాగానికి ఈ దళమే బాధ్యత వహిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే త్రివిధ దళాలలో కూడా అతి పెద్దది తూర్పు నౌకాదళం. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అన్నింటిలోకి అతి పెద్ద సంస్థ. వేలాది మంది పనిచేస్తున్నారు. తూర్పు నౌకాదళంలో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, అణు జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో పాటు మూడు నేవల్ ఎయిర్ స్టేషన్లు ఉన్నాయి. విశాఖలో ఐఎన్ఎస్ డేగా, తమిళనాడులో ఐఎన్ఎస్ రజాలి, దక్షిణ తమిళనాడులో ఐఎన్ఎస్ పరందు ఉన్నాయి. వీటిలో నిఘా విమానాలు పీ8ఐలు కూడా పనిచేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా విశాఖ కేంద్రంగానే పని చేయనుంది. న్యూక్లియర్ సబ్మెరైన్లు కూడా ఇక్కడే నావల్ డాక్యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో తయారవుతున్నాయి.
ఇది కూడా చదవండి
RK Kothaapluku : మరీ ఇంత నీచమా?