వైసీపీ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:13 AM
అన్నింటి మాదిరిగానే వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.
మరమ్మతులకు నోచుకోని తూటిపాల గ్రోయిన్
నాలుగేళ్ల క్రితం సర్పా నది వరదధాటికి ధ్వంసమైన కట్టడం
పునర్నిర్మాణానికి నిధులివ్వని నాటి ప్రభుత్వం
400 ఎకరాల నుంచి 130 ఎకరాలకు పడిపోయిన వరిసాగు
ప్రస్తుతం నీరు అందక ఎండిపోతున్న వరిపైరు
మాకవరపాలెం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):
అన్నింటి మాదిరిగానే వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. నాలుగు వందల ఎకరాలకు నీరందించే గ్రోయిన్ మూడేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోగా, వైసీపీ ఒక్క ఏడాది కూడా గ్రోయిన్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
400 ఎకరాల ఆయకట్టు
మండలంలోని తూటిపాల వద్ద సర్పా నదిపై చాలా ఏళ్ల క్రితం గ్రోయిన్ నిర్మించారు. దీని కింద సుమారు 400 ఎకరాల ఆయకట్టు వుంది. గతంలో మెట్ట పంటలు వేసుకునే రైతులు.. గ్రోయిన్ నిర్మాణం తరువాత వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2021లో భారీ వర్షాలు కురిసి, సర్పా నదికి వరద పోటెత్తడంతో తూటిపాల వద్ద గ్రోయిన్ కొట్టుకుపోయింది. ఆ ఏడాది వరి పంటకు నీరు అందలేదు. గ్రోయిన్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతులు, ఇరిగేషన్ అధికారుల ద్వారా వైసీపీ ప్రభుత్వానికి విన్నవించారు. కానీ నాటి పాలకులు నిధులు విడుదల చేయకుండా, వినతులను బుట్టదాఖలు చేశారు. తరువాత మూడేళ్లు కూడా ఇదే పరిస్థితి. కాగా గ్రోయిన్ నుంచి పొలాలకు నీరు అందకపోవడంతో 75 శాతం మంది రైతులు వరిసాగు చేయడంలేదు. దీనికిబదులు సరుగుడు తోటలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది 130 ఎకరాల్లో మాత్రమే వరి పంట వేశారు. కొద్ది రోజుల నుంచి ఎండ తీక్షణంగా కాస్తుండడంతో వరి పొలాలు నీటి ఎద్దడికి గురయ్యాయి. గ్రోయిన్ నుంచి పొలాలకు నీరు వచ్చేపరిస్థితి లేకపోవడంతో నేల నెర్రెల్చి, వరి పైరు ఎండిపోతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, గ్రోయిన్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు