Vishakhapatnam:వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ రాజీనామా
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:52 AM
విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ రాజీనామా చేశారు.
పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ఆడారి ఆనంద్ లేఖ
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
ఆడారితో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా పార్టీకి గుడ్‌బై
విశాఖపట్నం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ పంపించారు. శుక్రవారం డెయిరీ డైరెక్టర్లతో సమావేశమైన ఆనంద్.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటి నుంచి తప్పుకొంటున్నట్లు జగన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఆయనతో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆనంద్ 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ డెయిరీలో అక్రమాలు జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు శాసనసభా కమిటీని నియమించింది. కమిటీ ఇటీవలే విశాఖ డెయిరీని సందర్శించి అక్కడ కార్యకలాపాలు, రికార్డులను పరిశీలించింది.