AP News: డెడ్ బాడీ పార్శిల్ కేసు.. నిందితుడి అకౌంట్‌లో రూ.2 కోట్లు.. ట్విస్ట్ మామూలుగా లేదు..
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:36 PM
ఆంధ్రప్రదేశ్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో ఎట్టకేలకు నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు శ్రీధర్‌ను విచారణ చేయగా కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో ఎట్టకేలకు నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు శ్రీధర్‌ను విచారణ చేయగా కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు అతని మూడో భార్య, పదేళ్ల కుమార్తె సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన వదిన తులసి ఆస్తిని కొట్టేయాలన్న కుట్రలో ఇద్దరు భార్యలతో కలిసి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శ్రీధర్ తల్లిదండ్రులు కాళ్ల మండలం కోపెళ్లలో చెరువులపై జీవిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గాంధీ నగర్‌లో అతడి మెుదటి భార్య ఎలిజెబెత్ రాణి ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మెుగల్తూరులో ఉంచాడు. మూడో భార్యగా చెప్తున్న సుష్మకు పదేళ్ల కుమార్తె ఉంది. సుష్మను కాళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. వీరితోపాటు రెండో భార్య రేవతి తన అక్క తులసి ఆస్తిని కాజేయాలని ప్లాన్‌లో ఉండేదని, అందుకే భర్తకు సహకరించేదని సమాచారం.
తులసి ఇంటికి శవాన్ని పంపడం ద్వారా ఆమెను భయపెట్టాలని చూశారు. అందుకోసం శవం ఎక్కడైనా దొరుకుతుందేమో గాలించారు. దొరక్కపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలని నిర్ణయించారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా.. కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నైలాన్ తాడు గొంతుకు బిగించి హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత శవాన్ని గాంధీనగర్‌లోని ఇంట్లో అప్పటికే సిద్ధం చేసిన చెక్కపెట్టెలో పెట్టారు. మర్నాడు పర్లయ్య శవాన్ని తులసి ఇంటికి పార్శిల్‌గా పంపారు.
చెక్కపెట్టె తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైన తులసిపై అందరూ కలిసి బెదిరింపులకు దిగారు. శవం విషయం బయటకు పొక్కకుండా తాము చూసుకుంటామని, ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. సంతకం పెడతావా లేదా నువ్వు శవమవుతావా? అంటూ ఆమెపై బెదిరింపులకు దిగారని, ఫోన్ కూడా లాగేసుకున్నారని పోలీసులు తెలిపారు. మూత్రశాలకు అని చెప్పి బయటకు వెళ్లిన తులసి తన దగ్గర ఉన్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వారికి మెసేజ్ పంపింది. ఇంటికి చేరుకున్న కొంతమంది వ్యక్తులు ఏం జరిగిందంటూ ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పడంతో శ్రీధర్ వర్మ అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఇక అక్కడ్నుంచి శ్రీధర్ వర్మ తన మూడో భార్య సుష్మ, కుమార్తెతో కలిసి కారులో కృష్ణాజిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్ చేరుకున్నారు. అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్జ్‌లో ఒకరోజు బస చేసినట్లు తెలుస్తోంది. తర్వాత సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తూ ఉండగా.. ఎవరో కొత్తగా వచ్చారంటూ స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో వారుంటున్న ఇంటికి వెళ్లిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్‌లో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితుడు 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడు. శ్రీధర్ వర్మ బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.2 కోట్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు విస్తుపోయారు. ఆ నివాసంలో క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో స్థానికుల్లో భయాందోళన మెుదలైంది. పర్లయ్యను దారుణంగా హత్య చేసి పార్శిల్ చేసిన శ్రీధర్ వర్మకు ఉరిశిక్ష వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన తెలుగు ప్రముఖులు...
Veeranjaneyaswamy: అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు