Share News

Leopard: చిరుతపులి భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు..

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:49 PM

జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

Leopard: చిరుతపులి భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు..

ఏలూరు: జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గత నెల రాజమహేంద్రవరం వద్ద కనిపించిన చిరుత, ప్రస్తుతం ద్వారకాతిరుమల ఎం.నాగులపల్లి శివారులో సంచరిస్తున్న చిరుత రెండూ ఒక్కటేనని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పటివరకూ మనుషులపై ఎలాంటి దాడీ చేయలేదని, కుక్కలను మాత్రమే చంపి తింటోందని అధికారులు చెబుతున్నారు. చిరుత కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలు, బోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాజాగా ఎం.నాగులపల్లి శివారు చెరుకు తోటల్లో చిరుత కాలిముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అవి చిరుతవేనని రాజమహేంద్రవరం ల్యాబ్ అధికారులు నిర్ధరించారని వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.


మెుదటిసారి కనిపించిన చిరుత..

ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు చిరుత కదలికలపై నిఘా పెట్టారు. గ్రామ శివారు ప్రాంతాల్లో 15 ట్రాప్ కెమెరాలు, రెండు లైవ్ కెమెరాలు, బోను ఏర్పాటు చేశారు. అనంతరం సోమవారం రోజున వాటిని పరిశీలించి చిరుత సంచారం నిజమేనని తేల్చారు. వెంటనే దాని పాదముద్రలు ల్యాబ్‌కు పంపారు. వాటిని పరీక్షించిన అధికారులు అవి చిరుతవిగా నిర్ధరించారు. రాజమహేంద్రవరంలో కనిపించిన చిరుత ఇదేనని గుర్తించారు.


శనివారం రాత్రి భీమడోలు జంక్షన్- నాగులపల్లి మార్గంలో మళ్లీ పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో భీమడోలు మండలం పోలసానిపల్లి, అర్జావారిగూడెం, అంబరుపేట.. ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి పరిసరాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా తిరిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయ పనులకు సైతం గుంపులుగా వెళ్లాలని, చేతి కర్రలు వెంట తీసుకెళ్లాలని చెప్తున్నారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని ప్రజలేవ్వరూ భయపడవద్దని హామీ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 01:51 PM