Share News

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:09 AM

అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

  • భూముల కుంభకోణంపై చంద్రబాబు ఆరా

  • ఈ దందా తీరును వివరించిన పార్టీ నేతలు

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం ఆయనను హైదరాబాద్‌లోని నివాసంలో పలువురు పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలు కలిశారు. వారిలో విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, నెల్లిమర్ల ఇన్‌చార్జి బంగార్రాజు తదితరులున్నారు.

అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ చుట్టుపక్కల భారీ కుంభకోణం చోటు చేసుకుందని వారు చంద్రబాబుకు చెప్పారు. అసలుసిసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విశాఖలోనే జరిగిందని వివరించారు. అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ ఎలా చేయబోతున్నారో.. ముందుగానే తెలుసుకుని, తదనుగుణమైన భూములను అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు చేజిక్కుంచుకున్నారని వారు వివరించారు.

కనీసం 2 వేల ఎకరాలు పేద రైతుల నుంచి పెద్దల చేతుల్లోకి పోయాయని, లబ్ధి పొందిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. ఈ తతంగం మొదటి దశ నుంచి చివరి వరకు ఎలా జరిగిందో మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడి, జ్యోతుల నెహ్రూ చెప్పారు.

భూములను ఇంత ఘోరంగా కొట్టేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యల గురించి మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వివరించగా.. రైతులకు పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, టీడీపీ అధికారంలోకి వస్తే.. రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

Updated Date - Jun 01 , 2024 | 06:30 AM