Share News

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:38 PM

కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

AP News: అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..

తాడిపత్రి, నవంబర్ 17: కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. పెద్ద కూతురు గీతావాణి పెళ్ళి కుదిరింది. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్‌వీ ఫంక్షన్‌ హాలులో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రి వచ్చింది. పని ముగించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రోడ్డు దాటుతుండగా నాపరాతి బండలలోడుతో తాడిపత్రికి వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ట్రాక్టర్ గీతావాణిపై దూసుకెళ్లడంతో శరీరం చిద్రమై ఆమె అక్కడికక్కడే మృతిచెం దింది. తీవ్రంగా గాయపడిన ఆమె తమ్ముడు నారాయణరెడ్డిని అనంతపురం తరలించారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు.


సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. రైతు బిడ్డ..

శ్రీరామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ తన ముగ్గురు బిడ్డలను చదివించారు. కూతుళ్లు గీతావాణి, బిందు బాగా చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయ్యారు. నారాయణ రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. గీతావాణికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం కుదిరింది. నిశ్చితార్ధానికి రెండు కుటుంబాలవారు సిద్ధమయ్యారు. అందరూ సంబరాలకు సిద్ధమౌతుండగా.. రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.


ప్రమాదం గురించి తెలియగానే గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అందరూ ప్రమాద స్థలానికి వెళ్లారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసిన తల్లిదండ్రులు శ్రీరామిరెడ్డి, లక్ష్మిదేవి గుండెలవిసేలా రోదించారు. ’పెళ్లిచేసి అత్తవారింటికి పంపాలనుకున్నాం కదమ్మా.. ఇంతలోనే ఎంతపని జరిగింది.’ అంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీ రుమున్నీరుగా విలపించారు. గీతావాణి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Nov 17 , 2024 | 01:38 PM