YS Sharmila: జగన్ మారిపోయారు.. షర్మిల సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Jan 28 , 2024 | 10:36 PM
YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పథకం చాలా అద్భుతంగా అమలైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఉపాధిహామీ పథకం ఎవరికి హామీ ఇవ్వడం లేదని, భరోసా కల్పించడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షర్మిల..
అనంతపురం, జనవరి 28: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పథకం చాలా అద్భుతంగా అమలైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఉపాధిహామీ పథకం ఎవరికి హామీ ఇవ్వడం లేదని, భరోసా కల్పించడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షర్మిల.. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో 20 లక్షల హెక్టర్లలో వేరుశనగ పంట సాగుచేసేవారని.. వేరుశనగ పంట రాకపోతే ఇన్సూరెన్స్ ఇస్తామనే భరోసా అప్పుడు కల్పించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మూడు లక్షల హెక్టార్లలో కూడా వేరుశనగ పంట వేయడం లేదన్నారు.
ప్రస్తుతం రైతులకు ఏ సబ్సిడీ రావడం లేదని, దీనిపై అనంతపురం జిల్లా రైతులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తున్నా.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు అస్సలు మాట్లాడటం లేదని విమర్శించారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు షర్మిల. అనంతపురానికి, రాయలసీమకు ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలదీక్ష కూడా చేశారని, ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏమైందంటూ సీఎం జగన్‌ను నిలదీశారు.
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టానని, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వచ్చానని అన్నారు షర్మిల. వైసీపీ కష్టాల్లో ఉంటే 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు షర్మిల. ఆ పార్టీకి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి వైసీపీని నిలబెట్టానని అన్నారు. కానీ, ఇప్పుడు తనపైనే దాడులు చేస్తున్నారని, అయినా పర్లేదని అన్నారు షర్మిల. తనను ఎంతలా హింసించినా.. అవమానించినా.. తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల.
జగన్ మారిపోయాడు..!
అధికారంలోకి వచ్చాక జగన్ మారిపోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేస్తే.. నేడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా.. రాష్ట్రం మొత్తం బీజేపీ వశం అయిపోయిందని విమర్శించారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారని విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, ఒక మతాన్ని అవమానించి మరో మతాన్ని రెచ్చగొడతారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాల్చుకుంటారని బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు షర్మిల.
బీజేపీకి ఊడిగం..
ఏ బీజేపీని రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారో.. అలాంటి పార్టీకి జగన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా భర్తీ చేయలేదని, ఎన్నికల వేళ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఏపీకి చెందిన యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఒక్క పరిశ్రమ రాకపోతే యువత లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు షర్మిల.
ప్రజల్లోకి వెళ్లాలి..
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీకి ఓటు వేసినా.. అది బీజేపీకి వేసినట్లే అవుతుందన్నారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లకు ఓట్లు వేస్తే.. ఆ ఓట్లన్నీ బీజేపీకే వెళ్తాయన్నారు.