YS Jagan: జగన్ నిర్వాకం.. అమరావతిపై భారం..
ABN , Publish Date - Dec 11 , 2024 | 03:02 AM
వైఎస్ జగన్ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా! నాడు... శరవేగంగా,
అమరావతిపై 45%అదనపు భారం
ఐదేళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు
అయినా.. అడుగు ముందుకే వేస్తాం
మూడేళ్లలో పనులు పూర్తి చేస్తాం
మంత్రి పి.నారాయణ స్పష్టీకరణ
ఇప్పటికి రూ.20 వేల కోట్లకుపైగా పనులకు ప్రభుత్వ ఆమోదం
రూ.11,467 కోట్ల పనులపై జీవోలు
సీఆర్డీయే భేటీలో మరో రూ.8,821 కోట్ల పనులకు ఓకే
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా! నాడు... శరవేగంగా, యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులను జగన్ ఒక్కసారిగా ఆపివేశారు. తర్వాత మూడు ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు అవే పనులను పూర్తి చేయడానికి భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే 42వ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. కానీ, జగన్ మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. ఆయన నిర్వాకంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. రోడ్ల నిర్మాణం రేట్లు 25 నుంచి 28 శాతం పెరిగాయి. భవనాలకు సంబంధించి 35 శాతం నుంచి 55 శాతం పెరిగాయి. లే అవుట్స్‌లో గ్రావెల్ ధర 6 శాతం పెరుగుతుందని అంచనా. ఎస్‌వోఆర్ రేట్లు 29 శాతం, జీఎస్టీ 6 శాతం పెరిగింది. ఇతర నష్టాల వల్ల 1.6 శాతం భారం పడుతోంది. మొత్తంగా అన్నీ కలిపి 45 శాతం ధరలు పెరుగుతున్నాయి. ఐదేళ్లపాటు అమరావతి పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే ఇంత భారం ఉండేది కాదు. అయినా... సీఎం చంద్రబాబు సూచన మేరకు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరతాం’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
20,285 కోట్ల పనులకు ఓకే..
అమరావతిలో మొత్తం రూ.20,285 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో... రూ.11,467.27 కోట్ల పనులకు నిధుల విడుదలపై మంగళవారం జీవోలు కూడా జారీ అయ్యాయి. మరో రూ.8821.44 కోట్ల విలువైన పనులను ఆమోదిస్తూ మంగళవారం సీఆర్డీయే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ‘‘రూ.4,521 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం, రూ.3,807 కోట్లతో ల్యాండ్ పూలింగ్ లే అవుట్లలో రోడ్ల నిర్మాణం చేపడతాం. న్యాయమూర్తులు, మంత్రుల బంగళాలను రూ.492 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించాం. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్ల లే అవుట్ రోడ్లకు అనుమతించాం’’ అని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో మొత్తం 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు ఉండగా.. వాటిలో 97.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. ఈ నెల 16న జరిగే అథారిటీ తదుపరి సమావేశంలో మరికొన్ని పనులకు ఆమోదం తీసుకుంటామని చెప్పారు.
నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తి
ఈ నెల 15కల్లా అన్ని టెండర్లూ పిలుస్తామని, ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటీరియర్‌కు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమైన సింగపూర్ ప్రభుత్వంపై జగన్ సర్కారు కేసులు పెట్టిందని... వారు ఇప్పుడు మళ్లీ ముందుకు రావాలంటే ఎలా వస్తారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. ఈ విషయంలోనూ సీఎం నిర్ణయం మేరకు ముందుకెళ్తామని చెప్పారు.
వీటిపై జీవోలు...
41వ అథారిటీ సమావేశంలో వివిధ పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ చేసిన తీర్మానాలను పురపాలక శాఖ ఆమోదించింది. రూ.11,467.27 కోట్లతో 20 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. అందులో ముఖ్యమైనవి...
గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్-1, టైప్-2, క్లాస్-4 ఉద్యోగుల
అపార్ట్‌మెంట్స్ నిర్మాణ పనులు - రూ.594.54 కోట్లు
ఎన్‌జీవో భవనాల్లో మిగిలిన పనులు - రూ.607.50 కోట్లు
ఐఏఎస్ అఽధికారులకు సంబంధించిన 111 బంగళాల పెండింగ్ పనులు - రూ.516.5 కోట్లు
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు - రూ.984 కోట్లు
వరద నివారణ పనులు - రూ.1,585.95 కోట్లు