జగన్ ప్రభుత్వంలో 48 వేలకోట్ల రేషన్ దోపిడీ
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:03 AM
ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాగా గత జగన్ ప్రభుత్వం మార్చేసిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల పాత్ర
కొంతమంది అవినీతి అధికారులూ ఉన్నారు
ఏపీని రేషన్ బియ్యం మాఫియాగా మార్చారు
అక్రమ రవాణాపై దర్యాప్తు చేయాలి: షర్మిల
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాగా గత జగన్ ప్రభుత్వం మార్చేసిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం పెద్ద జాతీయ కుంభకోణమని, ఇదో పెద్ద మాఫియా అని ఆరోపించారు. సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఆరుగాలం కష్టపడే రైతులకు దక్కేది కన్నీళ్లయితే, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి కోట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేదల పొట్ట కొట్టి రూ.48,000 కోట్లను పందికొక్కుల్లా తినేశారు. భారీ దోపిడీ జరిగింది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది. కింది నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యం తరలిపోయింది. అక్రమంగా బియ్యం రవాణా అయిందంటే చెక్‌పోస్టుల పనితీరేంటో అంచనా వేయవచ్చు. ఏస్థాయిలో అవినీతి జరిగిందో కూడా తెలుస్తుంది. బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర దర్యాప్తు చేయాలి. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతోంది? సముద్రంలో బోట్లు వేసుకుని వెళ్లి హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చాలి’ అని షర్మిల పేర్కొన్నారు.