YS Sharmila: జగన్ ముడుపులపై సీబీఐ దర్యాప్తు జరపాలి
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:12 AM
అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
అదానీతో ఒప్పందాలను రద్దు చేయాలి
లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు షర్మిల లేఖ
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అదానీ నుంచి జగన్‌కు అందిన ముడుపులు, అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎంకు ఆమె సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఒప్పందాల్లో గౌతమ్ అదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆర్థికంగా నష్టాల్లోకి. కష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. అదానీ, జగన్ మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్ర సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా పీసీసీ భావిస్తోందన్నారు. సెకీ ద్వారా అదానీతో గత ప్రభుత్వం 25 ఏళ్లకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి భారమన్నారు. అదానీతో ఒప్పందాల రద్దుతో పాటు ఆ కంపెనీని తక్షణమే బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టు అమ్మకంపైనా విచారణ చేపట్టాలన్నారు. జగన్ ముడుపులపై దర్యాప్తు చేయిస్తారా లేదంటే అదానీతో అంటకాగుతారా అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.