Share News

YS Sharmila: వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే.. వైఎస్ షర్మిల ధ్వజం

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:39 AM

ఐదేళ్ల పాలనలో సీఎం జగన్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వైసీపీకి ఓటు వేస్తే.. డ్రైనేజీలో వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ‘ఏపీ న్యాయ్‌ యాత్ర’ నిర్వహించారు. ఆలూరు అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన రోడ్‌షోలో...

YS Sharmila: వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే.. వైఎస్ షర్మిల ధ్వజం

ప్రత్యేక హోదా తెచ్చావా... రాజధాని కట్టావా?

కడప స్టీల్‌కు పదేపదే శంకుస్థాపనలా?.. ఐదేళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలింది

జగన్‌ ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల మండిపాటు.. కర్నూలు జిల్లాలో ‘ఏపీ న్యాయ్‌ యాత్ర’

ఆదోని సభలో వైసీపీ మూకల కవ్వింపులు.. ‘మీ అన్న దేనికి సిద్ధం’ అంటూ షర్మిల ఆగ్రహం

ఐదేళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలింది

జగన్‌ ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల మండిపాటు

ఆలూరు/ఆదోని, ఏప్రిల్‌ 19: ఐదేళ్ల పాలనలో సీఎం జగన్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వైసీపీకి ఓటు వేస్తే.. డ్రైనేజీలో వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ‘ఏపీ న్యాయ్‌ యాత్ర’ (AP Nyay Yatra) నిర్వహించారు. ఆలూరు అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన రోడ్‌షోలో వైసీపీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ‘సీఎం జగన్‌ (YS Jagan) శిలఫలకాలను ఆవిష్కరిస్తూ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని శంకుస్థాపనల ప్రభుత్వంగా మార్చేశాడు. ఆలూరు నియోజకవర్గంలో నగరడోన, వేదవతి ప్రాజెక్టులు నిర్మిస్తానని హామీ ఇచ్చి విస్మరించాడు. మనకు ప్రత్యేక హోదా పదేళ్ల క్రితం వచ్చి ఉండాలి. కానీ హోదా తీసుకురావడంలో జగన్‌ ఘోరంగా విఫలమై చేతులు ఎత్తేశాడు. ఆయనకు కనీసం రాజధాని కట్టడమైనా చేతనైందా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. దాంతో ఎంతో అభివృద్ధి జరిగి మన బిడ్డలకు ఎన్నో ఉద్యోగాలు వచ్చేవి. కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి గతంలో వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారు. తిరిగి జగన్‌ మరోసారి శంకుస్థాపన చేశాడు. ఇంకా ఎన్నిసార్లు పదేపదే శంకుస్థాపనలు చేస్తావ్‌..?’ అంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటి పార్టీకి మళ్లీ ఓటు వేసేకన్నా... డ్రైనేజీలో వేయడం ఎంతో మేలని తెలిపారు. రైతుల సంక్షేమానికి రూ.300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ చెప్పలేదా అని ప్రశ్నించారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవేమీ కనపడటంలేదా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప మాత్రమే మిగిలిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు.


వైసీపీ శ్రేణుల అలజడి.. మీ అన్న దేనికి సిద్ధం అని షర్మిల ఆగ్రహం

ఆదోని పట్టణంలో షర్మిల శుక్రవారం చేపట్టిన ప్రచార రోడ్‌ షోలో వైసీపీ అల్లరిమూకలు అలజడి సృష్టించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆమె మాట్లాడుతుండగా బిల్డింగ్‌ పైకెక్కి వైసీపీ సిద్ధం జెండాను ఊపుతూ జగన్‌ అనుకూల నినాదాలు చేశారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ‘మీరు సిద్ధమైతే.. మేమూ సిద్ధం..’ అంటూ షర్మిల వారికి సవాల్‌ విసిరారు. ‘మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మేం సిద్ధం’ అని గట్టిగా మాట్లాడారు. ‘హామీలు ఇచ్చి మోసం చేయడానికి సిద్ధమా? హోదా ఇస్తామని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికి సిద్ధమా? ఇంతకూ దేనికి మీ అన్న సిద్ధం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు జోక్యం చేసుకొని వైసీపీ అల్లరిమూకలను కిందకు దించి అక్కడినుంచి పంపేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 07:41 AM