Share News

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:30 AM

జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని..

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

  • ఇప్పటికైనా సెకీ డీల్‌ను రద్దు చేయండి

  • విజయసాయి వ్యాఖ్యలకు సీఎం ఏం చెబుతారు?

  • రాష్ట్ర ప్రజల కోసం కోర్టుకెక్కడానికీ సిద్ధం: షర్మిల

అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని ముఖ్యమంత్రి చంద్రబాబును పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. అదానీతో డీల్‌పై ప్రజా శ్రేయస్సు కోసం కోర్టు మెట్లు ఎక్కడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మౌనంగా ఉంటున్నారంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకొన్నారా అని సోమవారం ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. సక్రమం కాబట్టే రద్దు చేయడం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని నిలదీశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం కోసం ఆరోపణలు చేశారే తప్ప.. వాటిలో నిజం లేదంటారా? సెకీ ఒప్పందంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అంతా తూచ్‌ అని భావించాలా? ముడుపులు వాళ్లకేనా.. తమకూ అందాయని అంగీకరిస్తున్నట్లేనా? అందుకే ఏసీబీని పంజరంలో బంధించారా? అందుకేనా అదానీపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రూ.1,750 కోట్ల లంచం తీసుకుని రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.50 లక్షల కోట్ల భారం వేసి.. అదానీకి మేలు చేసే డీల్‌పై మౌనంగా ఉన్నారా?’ అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. అందానీ డీల్‌పై చంద్రబాబు మౌనంగా ఉన్నా కాంగ్రెస్‌ మాత్రం ఆందోళనను ఆపదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా డీల్‌ను రద్దు చేసి, రూ.1,750 కోట్ల ముడుపులపై దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 17 , 2024 | 05:30 AM