YS Sharmila: రాగద్వేషాలు వీడి పాలించండి, చంద్రబాబుకు షర్మిల సూచన
ABN , Publish Date - Jun 12 , 2024 | 05:28 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, (Chandrababu Naidu) మంత్రులుగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలను మిళితం చేసి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూసుకోవాలి అని’ షర్మిల విన్నవించారు.
‘ఎన్నో సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో దాడులు జరగడం సరికాదు. ఇది శాంతి భద్రతలకే కాదు.. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన విశృంఖ పాలనతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్ట పోయింది. తిరిగి గాడిలోపెట్టి ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. అందుకోసమే ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. అందుకు అనుగుణంగా నడుచుకుని, వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మీ అనుభవంతో, పెద్ద మనసు చేసుకొని, నిస్పాక్షికతను చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్‌కు వైఎస్ షర్మిల ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇతర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగేలా చూడటంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నామని షర్మిల స్పష్టం చేశారు.