Andhra Pradesh: వైసీపీ నేతల పాపం.. వారికి శాపం.. న్యాయం జరిగేనా..
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:28 PM
ఏడాదికి మూడు పంటలు పండే భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వారి ద్వారా రైతులను రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి ..
కురబలకోట, డిసెంబరు 31: వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు చేసిన పాపాలు రైతన్నల పాలిట శాపంగా మారాయి. తమ స్వార్థంతో పాటు కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చడానికి ముదివేడు రిజర్వాయర్‌ను అప్పట్లో ఆఘమేఘాలపై మంజూరు చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వారి ద్వారా రైతులను రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి భూములను బలవంతంగా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వ్యవసాయం తప్ప మరేమీ తెలియని రైతులు తమకున్న ఏకైక ఆధారం సారవంతమైన భూములను కోల్పోయి ప్రస్తుతం రోడ్డున పడ్డారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట, బి కొత్తకోట మండలాల పరిధిలో రూ.759.50 కోట్లతో ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు, వైసీపీ నేతలు లబ్ధి చేకూర్చడానికి చేపట్టిన ప్రాజెక్టును ఎటువంటి అనుమతులు లేకుండానే రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిర్మాణ పనులను చకచకా చేపట్టి మూడు వంతులకు పైగా పనులు పూర్తి చేశారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులను గతంలో నిర్ణయించిన పరిహారం ఇప్పటి వరకు వారికి పంపిణీ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం తమను నిలువునా ముంచేసిందని, కూటమి ప్రయత్వమైనా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల రూపాయలకుపైగా అంచనా వ్యయంతో మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేసింది. కేవలం ఒక్క ప్రాజెక్టు అనుమతితో అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు అప్పట్లో చర్యలు చేపట్టింది. కాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఆవులపల్లె, నేతిగుంటపల్లె, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో ప్రాజెక్టులకు ప్రభుత్వం 2011లో అనుమతులు మంజూరు చేసింది. కాగా వీటిలో ముదివేడు రిజర్వాయర్ నిర్మాణాన్ని 1.98 టీఎంసీల సామర్థ్యంతో రూ.759.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాని చేపట్టింది. ఈ రిజర్వాయర్‌ను కురబలకోట, బి.కొత్తకోట మండలాల పరిధిలో 1077 ఎకరాలలో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం వ్యవసాయ భూములు, గ్రామాలు, చెరువులు, కుంటలను తీసేసుకున్నారు. కాగా కురబలకోట మండలంలోని పిచ్చల దాండ్లపల్లె పంచాయతీలో 798.7 ఎకరాలు, కురబలకోట పంచాయతీలో 64.95 ఎకరాలు, ముదివేడు పంచాయతీలో 64.95 ఎకరాలు, బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచాయతీలో 146.05 ఎకరాలు ప్రాజెక నిర్మాణం కోసం ఎంపిక చేశారు.
కాగా పట్టా డీకేటీ భూములకు ఒకే రకంగా భూపరిహారాన్ని ఎకరాకు రూ.12.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి కొంతమంది రైతులు అంగీకరించకపోవడంతో వారిని పలుమార్లు పోలీసులు రకరకాలుగా బెదిరించడంతో కొంతమంది అంగీకార పత్రాలపై సంతకాలు చేయగా.. మరికొంతమంది నిరాకరించారు. అయితే రైతులకు ఇవ్వాల్సిన భూ పరిహారం విషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు రైతులతో సమావేశాలు జరిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని గ్రీన్ ట్రైబ్యునల్ రూ.300 కోట్ల జరిమానా విధించడంతో పనులు నిలిచిపోయాయి. అంతేకాకుండా ప్రాజెక్టును అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని వైసీసీ నేతలు ఆరోపిస్తూ తంబళ్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబుపై అంగళ్లులో వైసీపీ నేతలు దాడికి పాల్పడి.. తిరిగి వారే చంద్రబాబుతో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాగా, ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన భూనిర్వాసితులకు రావాల్సిన భూపరిహారం, పునరావాసం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల భూములలో నిర్మాణ పనులను చేపట్టడంతో భూములు వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం పనికిరాకుండా పోయాయి. కట్ట నిర్మాణానికి అవసరమైన మట్టిని దాదాపుగా 400 ఎకరాలకు పైగా రైతుల పొలాల్లోని యంత్రాల సహాయంతో తీసి కట్ట నిర్మాణ పనుల కోసం తరలించారు. దీంతో ఆ పొలాలు వ్యవసాయానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయి. ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున గుత్త చెల్లిస్తామని నమ్మబలికి, కేవలం ఏడాది మాత్రం ఇచ్చి ఆ తర్వాత గుత్త సొమ్ము కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.
పునరావాస కల్పనలో న్యాయం జరగలేదు..
ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసాలు కప్పించడంలోనూ న్యాయం జరగ లేదు. వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టానుసారంగా ప్రాజెక్టును మంజూరు చేసే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కుని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆఘమేఘాలపై ప్రారంభించారు. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలోని శీతివారిపల్లె, కొత్తపల్లె, బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతిలోని చౌటకుంటపల్లె, దిన్నిమీదపల్లె గ్రామాలు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూర్తిగా నీటమునగనున్నాయి. వీరికి పునరావాసం కోసం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో 204 కుటుంబాలు, కోటావూరు పంచాయతీలో 125 కుటుంబాలను ఎంపిక చేశారు. కాగా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను కోల్పోయిన భూనిర్వాసితులకు ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని మంజూరు చేసింది.
ఇందులో భాగంగా భూములు, ఇళ్ళు కోల్పోయిన బాధితుల కోసం ప్రత్యేకంగా స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపడతామని చెప్పారు. కాగా కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలోని భూనిర్వాసితుల కోసం ముదివేడు క్రాస్ సమీపంలోని తానామిట్ట వద్ద 21.50 ఎకరాలు, బి.కొత్తకోట మండలంలోని కోటావూరు పంచాయతీలో నిర్వాసితుల కోసం 13.50 ఎకరాలను ఎంపిక చేసింది. కాగా ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల స్థలంతో పాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పిస్తుంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణాన్ని సొంతంగా నిర్మించుకునే వారికి రూ.10 లక్షలు, అలా కాకుండా ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వ నిబంధనలు మేరకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి వారికి అప్పగించడంతో పాటు మిగిలిన నగదును వారికి అందచేస్తామని చెప్పారు. అయితే ప్యాకేజీకి సంబంధించి పలుమార్లు అధికారులు భూనిర్వాసితులతో సమావేశాలు నిర్వహించినా వారికి స్థలాలు కేటాయించడం కానీ, ప్యాకేజీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
మా పరిధిలో ఏమీ లేదు..
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని నివేదికలను పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేశాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, పునరావాసాలకు సంబంధించి రైతుల నుంచి పూర్తి వివరాలను అప్పట్లో పనిచేస్తున్న అధికారులు సంబంధిత శాఖాధికారులకు అందజేశారు. మా పరిదిలో ఏమీ లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
- తపశ్విని, తహసీల్దార్
Also Read:
సెంచరీ కొట్టినా తెలుగోడ్ని నమ్మలేదు
సిట్ సభ్యుల మార్పపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
వైసీపీ నేతలు అలా చేస్తే తాట తీస్తాం.. మంత్రి మండిపల్లి మాస్ వార్నింగ్
For More Andhra Pradesh News and Telugu News..