Share News

CID Investigates : జగన్‌ ‘అరబిందో’పాయం

ABN , Publish Date - Dec 04 , 2024 | 04:08 AM

అరాచకమే హద్దుగా చెలరేగిపోయిన వైసీపీ తన ఐదేళ్ల పాలనలో చేయని దౌర్జన్యాలు లేవు. దేనిపైనైనా అప్పటి సీఎం జగన్‌ కన్ను పడితే చాలు.. బెదిరించడం.. అడిగింది ఇవ్వనంటే కేసుల బూచితో దారికి తెచ్చుకోవడం.

 CID Investigates  : జగన్‌ ‘అరబిందో’పాయం

  • కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు, సెజ్‌లో అడ్డగోలు అరాచకాలు

  • ‘ఆంధ్రజ్యోతి’ ఆనాడే చెప్పింది

  • తయారుచేసిన ఆడిట్‌ రిపోర్టులు చూపి పెద్దవాటాదారు కేవీరావు మెడపై కత్తి

  • జరిమానా, జైలు పేరుతో నోటీసులు చేసేది లేక మొత్తం వాటాలను

  • అరబిందోకు రాసిచ్చేసిన రావు పక్కపక్కనే ఒకే కంపెనీకి 2 పోర్టులు

  • ఉండకూడదన్న రూల్స్‌కూ తూట్లు ఎట్టకేలకు సీఐడీకి కేవీ రావు ఫిర్యాదు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అరాచకమే హద్దుగా చెలరేగిపోయిన వైసీపీ తన ఐదేళ్ల పాలనలో చేయని దౌర్జన్యాలు లేవు. దేనిపైనైనా అప్పటి సీఎం జగన్‌ కన్ను పడితే చాలు.. బెదిరించడం.. అడిగింది ఇవ్వనంటే కేసుల బూచితో దారికి తెచ్చుకోవడం. కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాదారు అయిన కేవీరావును బెదిరించి అరబిందో పేరిట మొత్తం కొట్టేశారు. దీనిపై ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు అందింది. కానీ ఈ దందాను మూడేళ్ల కిందటే ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ప్రభుత్వం ముసుగులో ఏవిధంగా జగన్‌ అరాచకాలు సాగిస్తున్నారో ప్రపంచానికి తెలియజెప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాటి దందాపై కొత్త ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీస్తూ ‘అరబిందో ఆటలు’ పేరిట కథనం ప్రచురించింది. కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న కాకినాడ సీపోర్టు (డీప్‌వాటర్‌ పోర్టు) నుంచి విదేశాలకు రసాయనాలు, ఎరువులు, గ్రానైట్‌రాయి మొదలైనవి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. 1999లో దీని ప్రారంభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సీపోర్టు యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా పోర్టులో నాలుగు బెర్తులను ఆపరేషన్‌-మెయింటినెన్స్‌-మేనేజ్‌మెంట్‌ విధానం కింద కాకినాడ సీపోర్టు యాజమాన్యం నిర్వహించాలి.


వచ్చే లాభాల్లో 22 శాతం వాటా ప్రభుత్వానికి చెల్లించాలి. కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కన్సార్షియం పోర్టు ప్రైవేట్‌లిమిటెడ్‌, సౌత్‌ ఇండియా ఇన్‌ఫా్ట్రస్టక్చర్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీ, వీఆర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర సంస్థలన్నీ కన్సార్షియంగా ఏర్పడి మొదటి నుంచీ ఈ పోర్టును నిర్వహిస్తున్నాయి. ఇందులో అతి పెద్ద వాటాదారు కేవీ రావు. అత్యధికంగా ఈయనకు 41.12 శాతం వాటా కింద 2.15 కోట్ల షేర్లున్నాయి.

పోర్టు లాభాల్లో 22 శాతం వాటా కింద రాష్ట్రప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకు చెల్లిస్తోంది. అయితే ఈ పోర్టు నిర్వహణ కింద వచ్చే లాభాల్లో కచ్చితంగా ఇంత మొత్తం ఏటా చెల్లించి తీరాలనే క్లాజులను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కన్సార్షియంకు అనుకూలంగా సవరించారు. అంతేకాకుండా వచ్చే 50 ఏళ్లు సీపోర్టు దాని అధీనంలోనే కొనసాగేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో కేవీరావు ఆధిపత్యం మరింత పెరిగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సీపోర్టుపై నాటి సీఎం జగన్‌ కన్ను పడింది. కార్గో రవాణా, వ్యాపార లావాదేవీల నిర్వహణ, ఆదాయ, ఖర్చుల విషయంలో కేవీ రావుకు చెందిన కేఐహెచ్‌పీఎల్‌ లాభాలను తక్కువగా చేసి చూపుతోందని నెపం మోపారు. తన సన్నిహితుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని రంగంలోకి దించారు. ఈయన పోర్టుల నిర్వహణలో జరిగే అంతర్గత అక్రమాలు, దర్యాప్తులో ఆరితేరిన క్రోల్‌ అనే ఆడిట్‌ సంస్థను తెరపైకి తెచ్చారు.


ఈ సంస్థ సీపోర్టులో రికార్డుల ఆడిట్‌ నిర్వహించి పలు లోపాలను జగన్‌కు కావలసిన విధంగా ‘గుర్తించింది’. కొన్ని వందల కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు తయారుచేసింది. ఈ నివేదికను చూపించి కేవీ రావు మెడపై కత్తిపెట్టారు. జరిమానా.. జైలు.. వాటా విక్రయం.. అనే మూడు మార్గాలను ఆయన ముందుంచారు. చేసేది లేక ఆయన తన 41.12 శాతం వాటాను అరబిందోకు విక్రయించారు. కొంతకాలానికి కాకినాడ సెజ్‌లో సీపోర్టు లిమిటెడ్‌కు ఉన్న వాటాలను సైతం అరబిందో బలవంతంగా కొనేసింది. దీంతో కాకినాడ సెజ్‌లో దాదాపు నూరుశాతం వాటాను లాగేసుకుంది.

  • సెజ్‌నూ చుట్టేశారు..

కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పదివేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది దేశంలోనే అతి పెద్దది. 2010లో జీఎంఆర్‌ సంస్థ భూసేకరణ ద్వారా సెజ్‌లో 51శాతం వాటా కొనుగోలు చేసింది. 46 శాతం వాటా కాకినాడ సీపోర్ట్‌ లిమిటెడ్‌కు, 3శాతం వాటా ఏపీఐఐసీకి ఉండేది. తొండంగి మండలంలో తీరాన్ని ఆనుకుని రూ.2,300 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ఓడరేవు నిర్మాణం కూడా చేపట్టాలని జీఎంఆర్‌ నిర్ణయించింది. 2019లో నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. అయితే నిధుల సమస్యతో అదానీతో 2020 మార్చిలో జీఎంఆర్‌ జట్టు కట్టింది. 49శాతం వాటాను దానికి కట్టబెట్టింది. అయితే తర్వాత ఆకస్మికంగా 2021లో సెజ్‌లో తనకున్న 51 శాతం వాటాను జీఎంఆర్‌ సంస్థ అరబిందోకు విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కార్పొరేట్‌ వర్గాల్లో పెనుసంచలనం సృష్టించింది. ఫార్మా కంపెనీ అయిన అరబిందో ఏకంగా సెజ్‌ను కొనుగోలు చేయడం వెనుక చాలా కథే నడచింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ కాంట్రాక్టును 2019లో టీడీపీ ప్రభుత్వం జీఎంఆర్‌కు కట్టబెట్టింది.


కాకినాడ సెజ్‌లో వాటాను అరబిందోకు అమ్మకపోతే విమానాశ్రయ కాంట్రాక్టును రద్దు చేస్తామని జగన్‌ ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించారు. చేసేది లేక సెజ్‌ను, అందులో పోర్టులో వాటాను అరబిందోకు అది అమ్మాల్సి వచ్చింది. కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టులో జగన్‌ వాటా వశంపై 2021 మార్చి 12న, కూటమి సర్కారు వచ్చాక అరబిందోపాయంపై ఈ ఏడాది జూలై 9న ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. మెడపై కత్తి పెట్టి వాటాలు రాయించుకున్నారని కేవీ రావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేయడంతో మరోసారి జగన్‌ దందా చర్చనీయాంశమైంది.

Updated Date - Dec 04 , 2024 | 04:09 AM