Mumbai: ఆసియా కుబేరుల అడ్డా ముంబై
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:36 AM
ఆసియాలో అత్యధిక మంది కుబేరులు నివసిస్తున్న నగరాల్లో బీజింగ్‌ను వెనక్కి నెట్టి ముంబై అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది...
రెండో స్థానానికి జారిన బీజింగ్
ప్రపంచ టాప్-10 బిలియనీర్లలోని ఏకైక భారతీయుడు ముకేశ్ అంబానీ
భారత్‌లో 271 మంది బిలియనీర్లు
హైదరాబాద్ నుంచి 17 మందికి చోటు
మురళి దివికి అగ్రస్థానం
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదల
ముంబై: ఆసియాలో అత్యధిక మంది కుబేరులు నివసిస్తున్న నగరాల్లో బీజింగ్‌ను వెనక్కి నెట్టి ముంబై అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది బిలియనీర్లుండగా, బీజింగ్‌లోని బిలియనీర్ల సంఖ్య 91గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే, ముంబై బిలియనీర్ల లిస్ట్‌లోకి మరో 27 మంది చేరగా.. బీజింగ్ బిలియనీర్ల పెరుగుదల 6కే పరిమితమైంది. ముంబై బిలియనీర్ల మొత్తం సంపద గడిచిన ఏడాది కాలంలో 47 శాతం వృద్ధి చెందగా.. బీజింగ్ కుబేరుల మొత్తం సంపద 28 శాతం తగ్గింది. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు నివసిస్తున్న నగరాల్లో న్యూయార్క్ (119 మంది), లండన్ (97 మంది) తర్వాత ముంబై 3వ స్థానంలో నిలిచింది. 57 మందితో ఢిల్లీ 9వ స్థానంలో ఉండగా 27 మంది బిలియనీర్లతో బెంగళూరు 23వ స్థానం లో ఉంది. కనీసం 100 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.8,300 కోట్ల పైమాటే) వ్యకిగత సంపద కలిగిన వారిని బిలియనీర్‌గా పరిగణిస్తారు.
రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు..
ఈసారి జాబితా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 3,279 మందికి చోటు దక్కింది. 167 మందికి కొత్తగా స్థానం లభించింది. ఈసారి భారత బిలియనీర్ల జాబితాలో మరో 84 మంది చేరారు. చైనా జాబితాలో కొత్తగా చేరిన వారి సంఖ్య 55కు పరిమితమైంది.
భారత కుబేరుల్లో ముకేశ్ అంబానీ 11,500 కోట్ల డాలర్ల సంపదతో తన అగ్రస్థానాన్ని కొనసాగించారు. గడిచిన ఏడాది కాలంలో అంబా నీ ఆస్తి 40 శాతం (3,300 కోట్ల డాలర్లు) పెరిగింది. అంతేకాదు, ప్రపంచ టాప్-10 కుబేరుల్లోని ఏకైక భారతీయుడు కూడా ఆయనే.
భారత సంపన్నుల్లో గౌతమ్ అదానీ 8,600 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో రెండో స్థానంలో నిలిచారు. హిండెన్‌బర్గ్ నివేదికతో భారీగా తరిగిపోయిన అదానీ ఆస్తి పుంజుకుని గడిచిన ఏడాది కాలంలో 62 శాతం పెరిగింది. ప్రపంచ సంపన్నుల్లో ఆయనకు 15వ స్థానం దక్కింది.
హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ 3,700 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆయన 34వ స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా (2,500 కోట్ల డాలర్లు) 55వ స్థానంలో, సన్‌ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ (2,400 కోట్ల డాలర్లు) 61వ స్థానంలో, కుమార మంగళం బిర్లా(1,800 కోట్ల డాలర్లు) వందో స్థానంలో ఉన్నారు. అనగా.. ప్రపంచ టాప్-100 బిలియనీర్లలో భారత్ నుంచి కేవలం ఆరుగురు చోటు సంపాదించుకోగలిగారు.
ఈసారి జాబితాలోని భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్లుగా (రూ.83 లక్షల కోట్లు) నమోదైంది. గడిచిన ఏడాది కాలంలో భారత బిలియనీర్లలో కేవలం 24 మంది సంపద మాత్రమే తగ్గింది. కాగా, చైనా బిలియనీర్లలో 573 మంది సంపద క్షీణించింది.
ఎలాన్ మస్క్ ప్రపంచ నం.1
టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్) సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ 23,100 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (18,500 కోట్ల డాలర్లు), ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ల గ్రూప్ ఎల్‌వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ అర్నో (17,500 కోట్ల డాలర్లు) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లోని తెలుగు సంపన్నులు
గ్లోబల్ ర్యాంక్, పేరు, కంపెనీ, ఆస్తి(బిలియన్ డాలర్లు)
381 - మురళి దివి - కుటుంబం దివీస్ ల్యాబొరేటరీస్ - 7
536 - పీ పిచ్చి రెడ్డి - మేఘా ఇంజనీరింగ్ - 6
561 - పీవీ కృష్ణా రెడ్డి - మేఘా ఇంజనీరింగ్ - 6
942 - జూపల్లి రామేశ్వర్ రావు కుటుంబం - మై హోమ్ ఇండస్ట్రీస్ - 4
1024 - పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి కుటుంబం - అరబిందో ఫార్మా - 3
1024 - బీ పార్థసారధి రెడ్డి కుటుంబం - హెటిరో ల్యాబ్స్ - 3
1855 - కే సతీశ్ రెడ్డి కుటుంబం - డాక్టర్ రెడ్డీస్ - 2
1855 - జీ అమరేందర్ రెడ్డి కుటుంబం - జీఏఆర్ - 2
2038 - వెంకటేశ్వర్లు జాస్తి కుటుంబం - సువెన్ ఫార్మా - 2
2038 - ఎం సత్యనారాయణ రెడ్డి కుటుంబం - ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ - 2
2418 - జీవీ ప్రసాద్ కుటుంబం డాక్టర్ - రెడ్డీస్ - 1
2750 - జీఎస్ రాజు కుటుంబం - 1
2750 - ఆళ్ల అయోధ్య రామి రెడ్డి - రాంకీ గ్రూప్ - 1
2895 - సీ వెంకటేశ్వర రెడ్డి - అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ - 1
2895 - ఎస్ సుబ్రమణ్యం రెడ్డి - అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ - 1
3058 - జగదీశ్ ప్రసాద్ ఆలూరు కుటుంబం - హెచ్‌బీఎల్ పవర్ - 1
3058 - వీసీ నన్నపనేని - నాట్కో ఫార్మా - 1