Share News

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

ABN , Publish Date - Aug 06 , 2024 | 06:03 PM

బంగ్లాదేశ్‌లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్‌కి కీలక మిత్రదేశంగా ఉంది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్‌కి కీలక మిత్రదేశంగా ఉంది. హసీనా రాజీనామాతో భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యం, ఆర్థిక అస్థిరతకు దారి తీసింది. బంగ్లాదేశ్‌లోని గందరగోళం ఇప్పటికే అనేక భారతీయ కంపెనీలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న భారతీయ సంస్థల షేర్లు క్షీణించడంతో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం స్పష్టంగా కనిపించింది.

మారికో: సఫోలా ఎడిబుల్ ఆయిల్‌గా ప్రసిద్ధి చెందిన మారికో స్టాక్ 4 శాతానికిపైగా పడిపోయింది. కంపెనీ ఆదాయంలో బంగ్లాదేశ్ 11-12 శాతం వాటాను కలిగి ఉంది. సంక్షోభం ఇంకా కొనసాగుతున్నందునా మారికో క్రయవిక్రయాలకు అంతరాయం కలగవచ్చు.

పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్: బంగ్లాదేశ్ నుంచి దాదాపు 25 శాతం ఆదాయాన్ని పొందుతున్న ఈ కంపెనీ, దాని షేర్లలో 3 శాతానికిపైగా క్షీణించింది.


ఇమామి: ఇమామీ షేర్లు కూడా 4 శాతానికిపైగా పడిపోయాయి. బంగ్లాదేశ్‌లో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న ఈ సంస్థ కార్యకలాపాలలో అంతరాయాలను ఎదుర్కొంటోంది. ఇవేగాక బంగ్లాదేశ్‌లో ఉన్న అనేక ఇతర భారతీయ కంపెనీలు ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. వీటిలో బేయర్ కార్ప్, GCPL, బ్రిటానియా, వికాస్ లైఫ్‌కేర్, డాబర్, ఏషియన్ పెయింట్స్, పీడీలైట్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, బజాజ్ ఆటోల షేర్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ట్రెంట్, పీడీఎస్, వీఐపీ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇమామి, మారికో, డాబర్, ఏషియన్ పెయింట్స్, పీడీలైట్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌తో సహా భారతీయ కార్పొరేట్‌ కంపెనీలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ప్రభుదాస్ లిల్లాధర్ అడ్వైజరీ హెడ్ విక్రమ్ కసత్ తెలిపారు.


టెక్స్‌టైల్, గార్మెంట్ రంగం

బంగ్లాదేశ్ సంక్షోభం భారతదేశ వస్త్ర తయారీ రంగంపై కూడా పడింది. బంగ్లాదేశ్ నూలు ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌గా ఉంది. మొత్తం ఎగుమతుల్లో 25-30 శాతం వాటా కలిగి ఉంది. అయితే తాజా సంక్షోభం నూలు ఎగుమతిదారులపై ప్రభావం చూపవచ్చు. వర్ధమాన్ టెక్స్‌టైల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ జైన్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి స్వల్పకాలమేనని.. ఇలాగే కొనసాగితే నూలు ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ సంక్షోభం భారతీయ వస్త్ర తయారీదారులకు తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, కేపీఆర్ మిల్‌, అరవింద్‌ లిమిటెడ్‌, ఎస్పీ అపెరల్స్‌, సెంచరీ ఎంకా, కిటెక్స్‌ గార్మెంట్స్‌, నహర్‌ స్పిన్నింగ్‌ వంటి కంపెనీల షేర్లు పుంజుకోవడం మార్కెట్‌లో సానుకూల మార్పును ప్రతిబింబిస్తోంది.


అదానీ పవర్

తాజా ఘర్షణలు అదానీ పవర్ లిమిటెడ్, బంగ్లాదేశ్ మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2017లో సంతకం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) ప్రకారం, అదానీ పవర్ బంగ్లాదేశ్‌కు 25 సంవత్సరాల పాటు 1,496 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాలి. జూన్ 2023 నుంచి అమలులోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరాకు కీలకమైంది. అదానీ పవర్ సరఫరా చేసే బొగ్గు ధరలపై గతంలో ఆందోళనలు జరిగాయి. తాజాగా రాజకీయ మార్పులతో, ఒప్పందాన్ని సవరించడంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో ముడిపడి ఉన్న స్టాక్‌లపై భవిష్యత్తులో పరిణామాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి సద్దుమణిగితే స్టాక్స్ మళ్లీ లాభాల్లోకి వెళ్తాయని చెబుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Aug 06 , 2024 | 06:03 PM