Share News

Income Tax: సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదుకు లిమిట్.. లేకుంటే ఐటీ నోటీసులు తప్పదు

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:47 PM

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.

Income Tax: సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదుకు లిమిట్.. లేకుంటే ఐటీ నోటీసులు తప్పదు
Finance Minister Nirmala Sitharaman

ఇటీవల కాలంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ఖాతాదారుడికి ఖచ్చితంగా ఆధార్, పాన్ కార్డు ఉండి తీరాలి. అలా అయితేనే బ్యాంక్‌లో ఖాతా తెరుస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాల్లో వివిధ రకాలు ఉన్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తదితర రకాలున్నాయి. కానీ చాలా మంది సేవింగ్ అకౌంట్‌లనే ఒపెన్ చేస్తారు.


అత్యధిక శాతం ఖాతాదారులు.. తాము సంపాదించిన నగదును ఈ ఖాతాల్లోనే పొదుపు చేస్తుంటారు. ఈ సేవింగ్ అకౌంట్లలో నగదు భద్రపరచడమే కాకుండా.. దీనిపై వడ్డీని సైతం పొందవచ్చు. మరికొన్ని సమయాల్లో.. ఇతరుల నగదును తమ ఖాతాల ద్వారా ఖాతాదారుడు లావాదేవీలు జరుపుతుంటాడు. అలాంటి వేళ సేవింగ్ అకౌంట్ పరిమితి దాటుతుంది. అసలు సేవింగ్ అకౌంట్‌లో లిమిట్ ఎంత ఉండాలి.


ఈ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేసుకోవచ్చు. ఓ వేళ ఆ పరిమితి దాటితే ఖాతాదారుడికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అంటే.. ఎదురయ్యే అవకాశాలున్నాయి. సేవింగ్ అకౌంట్లలో దాచుకునే సొమ్ము పరమితి దాటితే మాత్రం ఖాతాదారుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశముంది.


మరి అలా కాకూడదంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు ఉంచవచ్చు. అంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు అయినా జమ చేసుకోవచ్చు. అందుకు పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ.. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు రూ.10 లక్షల వరకు పరిమితి విధించింది.


అంటే ఒక ఏడాదిలో బ్యాంక్ సేవింగ్ అకౌంట్‌లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు. ఆపై నగదు జమ చేస్తే మాత్రం ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. దాంతో జమ అయిన నగదుపై పన్ను చెల్లించవలసి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.


దీంతో సేవింగ్ అకౌంట్‌లో జమ అయిన నగదుకు.. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో చూపిన వివరాలు కచ్చితంగా ఉండాలి. ఏ మాత్రం పొంతన లేకుంటే మాత్రం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీంతో ఖాతాదారుడు.. ఆ నగదుకు సంబంధించిన కచ్చితమైన వివరాలు ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాల్సి ఉంటుంది.


ఆ క్రమంలో నగదు రాబడి అంశంలో ఏ మాత్రం తప్పు జరిగినట్లు భావించినా.. ఆదాయపు పన్ను శాఖ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. దీంతో జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలకు సైతం ఆ శాఖ ఉపక్రమించే అవకాశముంది. ఈ నేపథ్యంలోల సేవింగ్స్ అకౌంట్‌లో నగదు ఎంత ఉండాలనే విషయాన్ని ఖాతాదారుడు ముందే తెలుసుకుని మసులుకుంటే మంచిది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 18 , 2024 | 07:41 PM