Retail Inflation: గుడ్ న్యూస్, ద్రవ్యోల్బణం తగ్గిందోచ్.. ఎంతకు చేరిందంటే..
ABN , Publish Date - Dec 12 , 2024 | 07:17 PM
దేశంలో గత కొన్ని నెలలుగా పైపైకి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈసారి తగ్గుముఖం పట్టింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికి మాత్రం చేరలేదు. అయితే ఎంత మేరకు తగ్గిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశ వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 5.48 శాతానికి చేరుకుంది. అంతకుముందు అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతంగా ఉంది. అక్టోబర్‌లో 10.9 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, ఇక నవంబర్‌లో 9.04 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం కూరగాయల ధరల పతనమని NSO తెలిపింది.
వినియోగం కారణంగా
అక్టోబర్‌లో (14 నెలల గరిష్టం) ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఈ ఉపశమనం లభించింది. ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ వినియోగం తగ్గుదల కారణంగా అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ కారణంగా డిసెంబర్‌లో ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.8 శాతానికి పెంచింది. ఇది అంతకుముందు 4.5 శాతంగా ఉండేది. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5% కంటే ఎక్కువగా ఉండటం ఇది వరుసగా మూడో నెల. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సాధారణంగా 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఉత్పత్తులు
నవంబర్ 2024 నెలలో కూరగాయలు, పప్పులు, చక్కెర, స్వీట్లు, పండ్లు, గుడ్లు, పాల అనుబంధ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, రవాణా, కమ్యూనికేషన్, వ్యక్తిగత సంరక్షణ వంటి ఉప సమూహాలలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని NSO తెలిపింది. ఇదే సమయంలో భారతదేశంలో టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 2.36%కి పెరిగింది. టోకు ద్రవ్యోల్బణం పెరగడానికి ఆహార పదార్థాల ధరలు అధిక స్థాయిలో ఉండటమే కారణం. సెప్టెంబర్‌లో ఈ రేటు 1.84 శాతంగా ఉంది. గత నెలలో ఆహార ఉత్పత్తుల ధరలు 13.57% పెరిగాయి.
కారణమిదేనా..
రుతుపవనాలు ఆలస్యంగా ఉపసంహరించుకోవడంతో పంటలకు నష్టం వాటిల్లిన తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలు ఖరీదైనవిగా మారడమే ఇందుకు కారణం. ఈ క్షీణత తర్వాత ప్రస్తుతం జీడీపీ వృద్ధి మందగిస్తున్నందున, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు వరకు సగటు ద్రవ్యోల్బణం రేటు 3.6 శాతంగా ఉంది. ఇది సెప్టెంబర్‌లో 5.5 శాతానికి, అక్టోబర్‌లో 6.2 శాతానికి చేరుకుంది. ఈ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌కు ఎక్కువ మనీ అడుగుతున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News