Share News

84,500 పైకి సెన్సెక్స్‌

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:18 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 84,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 25,500 ఎగువకు చేరుకుంది.

84,500 పైకి సెన్సెక్స్‌

  • సూచీ 1,360 పాయింట్లు అప్‌ .. 25,800 స్థాయికి నిఫ్టీ

  • సరికొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్‌ మార్కెట్‌ సూచీల పరుగు జూ రూ.6.24 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ తొలిసారిగా 84,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 25,500 ఎగువకు చేరుకుంది. ఫెడ్‌ రేటు 0.50 శాతం తగ్గిన నేపథ్యంలో అమెరికా, ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ సూచీలూ ఉవ్వెత్తున ఎగిశాయి. వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, రియల్టీ, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లలో మదుపరులు జోరుగా కొనుగోళ్లు జరిపారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లకూ డిమాండ్‌ పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా మార్కెట్‌ ర్యాలీకి దోహదపడ్డాయి. దాంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్క రోజులో రూ.6.24 లక్షల కోట్లు పెరిగి మొత్తం రూ.471.72 లక్షల కోట్లకు (5.65 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

  1. జూసెన్సెక్స్‌ ఒక దశలో 1,509.66 పాయింట్లు (1.81 శాతం) ఎగబాకి 84,694.46 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 1,359.51 పాయింట్ల (1.63 శాతం) లాభంతో 84,544.31 వద్ద స్థిరపడింది. సూచీకిది సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు కూడా.

  2. జూనిఫ్టీ సైతం ఒక దశలో 433.45 పాయింట్ల (1.70 శాతం) వృద్ధితో 25,849.25 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డును, చివరికి 375.15 పాయింట్ల (1.48 శాతం) పెరుగుదలతో 25,790.95 వద్ద ఆల్‌టైం గరిష్ఠ ముగింపును నమోదు చేసింది.

  3. జూసెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 26 లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం షేరు 5.57 శాతం రాణించి సూచీ టాప్‌ గెయినర్‌గా అవతరించింది. బీఎ్‌సఈలో మొత్తం 4,059 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,383 లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ సహా 265 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

  4. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.2,500 కోట్ల ఐపీఓ: తన అనుబంధ విభాగమైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐపీఓ ద్వారా షేర్లను స్టాక్‌ మార్కెట్లో నమోదు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. ఐపీఓలో భాగంగా హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.2,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత, అర్హులైన వాటాదారులకు చెందిన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించేందుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ తెలిపింది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో హెచ్‌డీఎ్‌ఫ బ్యాంక్‌ 94.64 శాతం వాటా కలిగి ఉంది.

  5. జూరాజస్థాన్‌కు చెందిన కేఆర్‌ఎన్‌ హీట్‌ ఎక్స్ఛేంజర్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌ కంపెనీ రూ.342 కోట్ల ఐపీఓ ఈనెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.209-220గా నిర్ణయించింది.


  • ఐపీఓల బిజీ

  • 14 ఏళ్లలో అత్యంత సందడి మాసమిదే: ఆర్‌బీఐ

ఈ నెలలో ప్రైమరీ మార్కెట్‌ వరుస పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లతో కోలాహలంగా మారింది. ప్రధాన ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో లిస్ట్‌ కానున్న కంపెనీల ఐపీఓలకు గడిచిన 14 ఏళ్లలో అత్యంత సందడి (బిజీ) మాసమిదేనని శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆర్‌బీఐ వెల్లడించింది. ఇప్పటికే 28 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వచ్చే వారంలో మరిన్ని రాబోతున్నాయి. ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల ద్వారా సమీకరణ ఈ ఏడాదిలో సమృద్ధిగా ఉందని, 2024 ప్రథమార్థానికి ప్రపంచవ్యాప్త ఐపీఓల్లో అత్యధికం (27 శాతం) భారత్‌లోనే నమోదైనట్లు ఆర్‌బీఐ తెలిపింది. అందులో ఎస్‌ఎంఈ ఐపీఓలే అధికమని పేర్కొంది. ఐపీఓల ద్వారా సమీకరించిన నిధుల విలువలో మాత్రం భారత్‌ వాటా 9 శాతంగా ఉంది. దేశీయ ఆర్థిక సేవల మార్కెట్‌ గణనీయ మార్పులకు లోనవుతున్నదని, గడిచిన కొద్దికాలంలో ఎస్‌ఎంఈ ఐపీఓలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిందని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది.

ఎస్‌ఎంఈ ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్‌ ఫండ్లు సైతం ఎగబడుతుండటంతో ఇష్యూ సైజుకు పదులు, వందల రెట్లలో సబ్‌స్ర్కిప్షన్‌ లభిస్తోందని రిపోర్టులో ప్రస్తావించింది. కాగా, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా లిస్టెడ్‌ కంపెనీల నిధుల సమీకరణ కూడా గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి రూ.60,000 కోట్లకు చేరుకుని ఉండవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.

Updated Date - Sep 21 , 2024 | 03:20 AM