Rajasthan: పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ABN , Publish Date - Jan 06 , 2024 | 10:56 AM
దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి.
దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. గతేడాది జరిగిన ఒడిశా రైలు ప్రమాదాన్ని జనాలు ఇప్పటికీ మరిచిపోలేదు. దీంతో రైలు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా రాజస్థాన్ లోని కోటాలో రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. కోటా జంక్షన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జోధ్‌పూర్-భోపాల్ ప్యాసింజర్ రైలుకు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. తాజా ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.