Share News

Hyderabad: 30 రోజుల్లో 20 హత్యలు...

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:22 AM

వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ, ఆర్థిక వ్యవహారాలతో హత్యలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి సౌత్‌జోన్‌ పరిధిలో గల పాతబస్తీలోని ఫలక్‌నుమా, శాలిబండ, ఛత్రినాక(Falaknuma, Shalibanda, Chatrinaka), ఆసిఫ్‏నగర్‌, భవానీనగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్‏స్టేషన్ల పరిధిలో హత్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Hyderabad: 30 రోజుల్లో 20 హత్యలు...

- వివాహేతర సంబంధాలతో..

- మహానగరంలో కలవరపెడుతున్న ఘటనలు

- వివాహేతర సంబంధాలతోనే అధికం

- ఉమ్మడి సౌత్‌ జోన్‌లో రెచ్చిపోతున్న రౌడీమూకలు

- సమీక్షలకే పరిమితమవుతున్న అధికారులు

మహా నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 30 రోజుల వ్యధిలోనే 20కి పైగా హత్యలు జరిగాయి. అందులో ఒక్కరోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో అసలు ఈ నగరంలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల పరిస్థితేంటి? అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస హత్యల్లో సింహభాగం ఉమ్మడి సౌత్‌జోన్‌లోనే జరుగుతుండటంతో పోలీసులకు శాంతి భద్రతల సమస్య పెనుసవాల్‌గా మారింది.


హైదరాబాద్‌ సిటీ: వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ, ఆర్థిక వ్యవహారాలతో హత్యలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి సౌత్‌జోన్‌ పరిధిలో గల పాతబస్తీలోని ఫలక్‌నుమా, శాలిబండ, ఛత్రినాక(Falaknuma, Shalibanda, Chatrinaka), ఆసిఫ్‏నగర్‌, భవానీనగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్‏స్టేషన్ల పరిధిలో హత్య కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఒక్కరోజే మూడు హత్యలు..

జూన్‌ 29న నగరంలో ఒకేరోజు మూడు హత్యలు జరిగాయి. వాటిలో ఒక హత్య ఆధిపత్యపోరు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరగగా, సైబరాబాద్‌ పరిధిలో జరిగిన రెండు హత్యల్లో ఒకటి వివాహేతర సంబంధం, మరొకటి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. అంతకు ముందు 10 మంది మైనర్లు కలిసి తమ స్నేహితున్ని దారుణంగా హత్య చేశారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే కక్ష పెంచుకొని, మరో పది మంది స్నేహితులతో కలిసి హత్య చేశారు. బీర్‌బాటిల్‌తో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని రైల్వేట్రాక్‌పై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆడుకోవద్దని అమ్మ మందలించిందని..


పోలీసుల నిర్లక్ష్యమా.. నిఘా వర్గాల వైఫల్యమా..?

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి ఉమ్మడి సౌత్‌జోన్‌తో పాటు.. ట్రై కమిషనరేట్‌ పరిధిలోనూ అల్లరిమూకలు, రౌడీగ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. సగటున రెండు రోజులకో హత్య జరుగుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పాత నేరస్థులు, రౌడీషీటర్లు, ఘరానా నేరస్థుల కదలికలపై నిఘాను అంతగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలను, హత్యాయత్నాలను, బెదిరింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయం అర్థం అవుతోంది.

అర్ధరాత్రి, తెల్లవారుజామునే..

ఉమ్మడి సౌత్‌జోన్‌లో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు ఎక్కువగా అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చాదర్‌ఘాట్‌లో వెలుగులోకి వచ్చిన హత్య ఈ కోవకు చెందినదే. వరుస హత్యల నేపథ్యంలో పోలీసుల పనితీరుపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల సమీక్షలు, క్రైమ్‌ రివ్యూలు కేవలం ఉపన్యాసాలకు, ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

city2.jpg


నెల వ్యవధిలో జరిగిన హత్యల్లో కొన్ని..

- జూన్‌ 25న శాలిబండ పరిధిలో మద్యం మత్తులో ఫెరోజ్‌ (28), స్నేహితుడితో గొడవ పడ్డాడు. కత్తితో ఫెరోజ్‌పై స్నేహితుడు విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చాడు.

- పాతకక్షల కారణంగా అన్వర్‌, అసద్‌ అనే పాత నేరస్థులు వాజిద్‌ అనే వ్యక్తిని మాట్లాడుదామని జూన్‌ 18న అర్ధరాత్రి పిలిచారు. వాజిద్‌ వెంట అతని సోదరులు సాజిద్‌, ఖదీర్‌, రఫిక్‌ సిమ్లాన్‌ వెళ్లారు. వీరి మధ్య మాటా మాటా పెరగడంతో అన్వర్‌, అసద్‌లు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఇందులో రఫిక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

- సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో భార్య రోజాను భర్త అతి దారుణంగా హత్య చేశాడు.

- జూన్‌ 20న ఆసి్‌ఫనగర్‌లో షేక్‌ అలీం దారుణ హత్యకు గురయ్యాడు.

- కాచిగూడలో జూన్‌ 26న శంషుద్దీన్‌ను చంపేశారు.

- సనత్‌నగర్‌ పరిధిలో చోరీ పంపకాల్లో తేడా రావడంతో పాతనేరస్తుడిని దుండగులు దారుణంగా హతమార్చారు.


- బాలాపూర్‌లో జూన్‌ 13న ముబారక్‌ సిబార్‌ అనే వ్యక్తిని అతికిరాతంగా హత్య చేశారు. గుర్రం చెరువు వద్ద బాబానగర్‌కు చెందిన యువకులు మాట్లాడుకుందామని పిలిచి యువకునికి కత్తులతో దాడి చేసి చంపేశారు.

- బేగంపేటలో జూన్‌ 25న ఓ యువకుడిని స్నేహితుడే కత్తులతో పొడిచి హత్య చేశాడు. తన మరదలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేశాడు.

వివాహేతర సంబంధాలతో..

- ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌ హసన్‌నగర్‌కు చెందిన జకీర్‌ అలీ (29) గత నెల 23న హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం, అసభ్య ప్రవర్తనే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.

- నార్సింగ్‌ పోలీస్టేషన్‌ పరిధిలో దుబాయ్‌కు వెళ్లాల్సిన ఇంజనీర్‌ హత్యకు గురయ్యాడు.


- జగద్గిరిగుట్టలో జూన్‌ 29న జరిగిన అనిల్‌కుమార్‌ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

- కోర్టులో విడాకుల కేసు పెండింగ్‌లో ఉండగానే తాను రెండో పెళ్లి చేసుకుంటానని ఛత్రినాకకు చెందిన వ్యక్తి స్నేహితురాలు (22)ను వేధించసాగాడు. విడాకులయ్యాక ఆలోచిస్తా అన్న స్నేహితురాలిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్లి స్ర్కూడ్రైవర్‌తో ముఖంపై దాడి చేశాడు. అనంతరం గొంతునులిమి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

- ఈ నెల ఒకటో తేదీన రామంతపూర్‌ వివేక్‌నగర్‌లో ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చంద్రమౌళి.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఉప్పల్‌ భగాయత్‌లో మాట్లాడుకుందామని పిలిచి, ఆమెను కారుతో ఢీ కొట్టి చంపేశాడు. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 10:22 AM