Hyderabad: స్కూళ్లకు తాళాలు వేసి మరీ దావత్.. 80 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:02 PM
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు గాడి తప్పుతున్నారు. తరగతి గదులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పాఠశాలలకు తాళాలు వేసి పార్టీ కొందరు టీచర్లు పార్టీ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యనందించడంతో పాటూ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు కొందరు ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. పిల్లలు విద్యాబుద్ధుల నేర్పించాల్సిన చాలామంది టీచర్లు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సరస్వతి నిలయంగా ఉండాల్సిన పాఠశాల గదులను పబ్‌లుగా, పార్టీలకు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పాఠశాలకు తాళాలు వేసి మరీ టీచర్లంతా పార్టీ చేసుకున్నారు. ఈ ఘటనలో 80 మంది టీచర్లకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే..
పనివేళల్లో పాఠశాలలను మూసివేసి పార్టీ చేసుకున్న 80 మంది టీచర్లపై హైదరాబాద్ కలెక్టర్ (Hyderabad Collector) అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మంగళవారం (Showcause notices to teachers) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న విందు కోసం స్కూళ్ల మూసివేతకు అనుమతినిచ్చిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డీఐఓఎస్) యాదగిరిని సస్పెండ్ చేశారు.
షేక్‌పేట్ మండలంలోని 20 ప్రాథమిక పాఠశాలలను ఈనెల 13న సంబంధిత టీచర్లు మధ్యాహ్నం ఒంటిగంటకే మూసివేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి మరీ పాఠశాలల్లో పార్టీ చేసుకున్నారు. కొత్తగా విధుల్లో చేరిన ఎస్‌జీటీలు, సీనియర్ ఎస్‌జీటీలు, ఏడుగురు హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు..ఇలా మొత్తం 80 మంది బంజారాహిల్స్‌లోని ఓ స్కూల్లో విందు చేసుకున్నారు. గమనించిన స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందిచారు. దీని ఆధారంగా 80 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా అనుమతి ఇచ్చిన డీఐఓఎస్‌ను సస్పెండ్ చేశారు. కాగా, ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్థానికులతో పాటూ నెటిటజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.