Hyderabad: బంజారాహిల్స్‌లో ‘స్టోన్ బ్యాచ్’.. వ్యాపార సముదాయాలపై రాళ్ల దాడి
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:38 AM
బంజారాహిల్స్(Banjara Hills)లో జులాయిలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్ 2లో సాయంత్రం 7-8 గంటల సమయంలో తిరుగుతూ వ్యాపార సముదాయాలపై రాళ్లు రువ్వి పారిపోతున్నారు. ఈ దాడి కారణంగా పెద్దశబ్దాలతో అద్దాలు పగిలిపోతుండటంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు భయపడుతున్నారు.
- అద్దాలను ధ్వంసం చేసి పరారీ
- ఒక్క రోజే ఆరు కేసులు
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills)లో జులాయిలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్ 2లో సాయంత్రం 7-8 గంటల సమయంలో తిరుగుతూ వ్యాపార సముదాయాలపై రాళ్లు రువ్వి పారిపోతున్నారు. ఈ దాడి కారణంగా పెద్దశబ్దాలతో అద్దాలు పగిలిపోతుండటంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు భయపడుతున్నారు. ఇలా సుమారు పది వ్యాపార సముదాయాలపై రాళ్లతో దాడిచేశారు. కొన్ని సముదాయాల్లో రెండు నుంచి మూడుసార్లు రాళ్లతో దాడి చేయడంతో వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. ఈనెల 16న ఒక్క రోజే ఐదు కేసులు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో నమోదయ్యాయి. ఓ కేసు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్(Jubilee Hills Police Station)లో నమోదైంది. వారంకిత్రం కూడా రెండు కేసులు నమోదయ్యాయి.
ఇదికూడా చదవంండి: Hyderabad: రా.. రమ్మంటున్న రైల్ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఉచిత ప్రవేశం
- బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 సినీమ్యాక్స్(ఆర్‌కే) కాంప్లెక్స్‌లో గత నెల 21న గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దాలు ఒక్కసారిగా పెద్దశబ్దంతో పగిలిపోయాయి. ఎండ వేడికి అయి ఉండొచ్చు అని పెద్దగా పట్టించుకోలేదు. అదే నెల 27న మొదటి అంతస్తులో అద్దాలు పగిలిపోయాయి. ఈనెల 8న మరోసారి గ్రౌండ్ ఫ్లోర్‌లో డిస్‌ప్లే అద్దాలు పగిలాయి. వరుస ఘటనలతో ఖంగుతిన్న నిర్వాహకులు.. పరిశీలించగా రాయి దొరికింది. ఎవరో ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి, అద్దాలు పగులకొగొట్టారని తెలుసుకున్న కాంప్లెక్స్ మేనేజర్ సర్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిరూడా చదవండి: Lok Sabha Elections: పోరు.. ఇక జోరు.. నేటినుంచి నామినేషన్లు
మరికొన్ని ఘటనలు..
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్2(Banjarahills Road No.2)లోని వాన్‌హుస్సేన్ సంస్థపై గతనెల 20న, 21న రెండుమార్లు రాళ్లతో దాడులు చేశారు. ఈదాడిలో షోరూం ముందర డిస్‌ప్లే అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్డునెంబర్4లో వైట్‌క్రో షో రూంపై గతనెల 20న సాయంత్రం 7 గంటలకు, రాత్రి 10 గంటలకు ఒకేరోజు రెండుసార్లు దాడులు జరిగాయి. గతనెల 27న కూడా ఇదే మాదిరి దాడి జరగడంతో అద్దాలు పగిలిపోయాయి. దీంతో పెద్దశబ్దం రావడంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని పరుగులు పెట్టారని బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు నెంబర్ 11లోని అండర్ ఆర్మర్ స్టోర్‌పై ఈనెల 5న రాయితో దాడిజరగడంతో వినియోగదారులు ఆందోళన చెంది వెనక్కి వెళ్లిపోయారని స్టోర్ మేనేజర్ మహ్మద్ అబ్రార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Parliament Elections: బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు
- రోడ్డు నెంబర్ 2లోని సూర్యసిల్క్ టెక్స్టైల్ షోరూంపై ఈనెల 4, 8న రెండు మార్లు దాడులు జరిగాయి. అద్దాలుపగిలిపోవడంతో రాయి వచ్చి స్టోర్ సిబ్బందిపై పడి, స్వల్పగాయం అయింది. రోడ్డు నెంబర్ 2లోని గాడ్‌ఫ్రే ఫిలిఫ్స్లో గతనెల 20న పది ఫీట్ల ఎత్తులో ఉన్న అద్దాలపై రాయి విసరడంతో అవి పగిలిపోయాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతనెలలో కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఇలాంటి ఘటనపై ఫిర్యాదు అందింది. ఇప్పటి వరకు సుమారు ఏడు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులు వచ్చిన షోరూంల వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: చేవెళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య