Share News

Hyderabad: పిల్లలపై పైశాచికం.. శివారు ప్రాంతాల్లో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:30 AM

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. పిల్లలైతే బయటకు చెప్పరనే ధీమాతో అభం శుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు ఒడిగడుతున్నారు.

Hyderabad: పిల్లలపై పైశాచికం.. శివారు ప్రాంతాల్లో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలు

- వెలుగులోకి కొన్ని మాత్రమే

- పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. పిల్లలైతే బయటకు చెప్పరనే ధీమాతో అభం శుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు ఒడిగడుతున్నారు. కొందరు పిల్లలకు తాయిలాలు ఆశ చూపించి, బెదిరించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధిస్తున్నారు. అపరిచితులకంటే పరిచయం ఉన్న వారే 93 శాతం మంది ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో కొందరు కుటుంబ సభ్యులే ఈ దురశ్చర్యలకు పాల్పడుతుండడం విస్తు గొలుపుతోంది. కొన్ని సంఘటనలు కుటుంబ సభ్యులు, స్థానికులు, బాధితుల ద్వారా బయటకు వస్తే.. మరికొన్ని సంఘటనలు సెటిల్‌మెంట్‌ ముసుగులో బయటకు పొక్కకుండా మరుగునపడిపోతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వాతావరణ మార్పులతో ఫీవర్‌ ఆస్పత్రికి రోగుల తాకిడి


అసోసియేషన్‌ సభ్యుడి వత్తాసు..

బాలానగర్‌, దుండిగల్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలలో వెలుగు చూసిన ఈ సంఘటనలు బాలికలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమ వారెవరో కామాంధులెవరో తెలుసుకోలేకపోతున్నారు. ఇటీవల బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వ్యక్తికి స్థానిక అసోసియేషన్‌ సభ్యుడు వత్తాసు పలికాడు. బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ కుదుర్చి కొంత డబ్బు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు కేవలం బాలానగర్‌ ప్రాంతంలోనే కాదు మరికొన్ని ప్రాంతాలలో వెలుగు చూస్తున్నా తమ పరువు పోతుందేమోనని బాధితుల తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేయడం లేదు.


షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో ఇతరులు తమతో మెలిగే తీరు ఎలా ఉండాలి? వారి స్పర్శ ఎలా ఉంటే తల్లిదండ్రులకు చిన్నారులు సమాచారం ఇవ్వాలి.. లైంగిక వేధింపుల విషయంలో బాలికలకు ఎలాంటి సూచనలు చేయాలనే విషయాలను సైబరాబాద్‌, షీటీం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు అప్రమత్తంగా ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. తమతో పెద్దలు, సన్నిహితులు, అపరిచితులు వ్యవరించే తీరుపై అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాలపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని పోలీసులు చెబుతున్నారు.

city9.2.jpg


ఫిర్యాదు చేయండిలా..

చిన్నారులు లైంగిక వేధింపులకు గురైతే సైబరాబాద్‌ భద్రతా కేంద్రాన్ని నేరుగా సంప్రదించి సహాయం పొందవచ్చు.

పోలీస్‌ - 100

చైల్డ్‌లైన్‌ - 1098

సైబరాబాద్‌ షీటీం వాట్సాప్‌ నంబరు - 9690617444

బాలానగర్‌ షిటీం - 9490617349

ఈమెయిల్‌: sheteam.cyberabad@gmail.com

ఫేస్‌బుక్‌: sheteam.cyberabad

ట్విటర్‌: cyberabadpolice


అపరిచితులతో వెళ్లొద్దు

- పెద్దలు పట్టుకునే తీరు సౌకర్యవంతంగా ఉండాలి.

- భయం, బాధ కలిగించేలా ఉండకూడదు. ఎవరైన అనవసరంగా తాకేందుకు అవకాశం ఇవ్వకూడదు.

- అపరిచితులను కౌగిలించుకోవద్దు. అలాంటి వారు కౌగిలి కోసం ప్రయత్నిస్తే తప్పని సరిగా తిరస్కరించాలి.

- ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎలా తప్పించుకోవాలి? లైంగిక వేధింపులకు గురయ్యే సమయంలో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలను తల్లిదండ్రులు తరచూ పిల్లలకు చెబుతుండాలి.


- అనుకోని సంఘటన జరిగితే కేకలు వేస్తూ ఆ ప్రాంతం నుంచి లేదా ఆ వ్యక్తి నుంచి దూరంగా పరుగెత్తాలి.

- సమీపంలో ఎవరైనా ఉన్నారో గమనించి సహాయం కోసం అర్థించాలి. తమకు ఎదురైన అనుభవం వెంటనే తల్లి తండ్రులకు చెప్పాలి.

- అపరిచితుల వెంట వెళ్లొద్దు.

- తెలిసిన వ్యక్తులు దూర ప్రాంతానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే అంగీకరించొద్దు.


బాలికలను వేధిస్తే పోక్సో కేసు

తల్లిదండ్రులు పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కూల్‌, ట్యూషన్‌, మార్కెట్‌కు వెళ్లినా వారిని ఓ కంట కనిపెట్టాలి. ఎవరైనా వేధిస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి. బాలికలను వేధిస్తున్న వారిపై పోక్సో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.

- నర్సింహరావు, సీఐ, బాలానగర్‌


అఘాయిత్యాలపై 9490617349 కు ఫోన్‌ చేయండి

పిల్లలు అపరిచితుల బారిన పడకుండా అప్రమత్తంగా ఎలా ఉండాలో తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. మంచి, చెడు స్పర్శలు ఎలా ఉంటాయో వారికి వివరించాలి. అనుకోని సంఘటన జరిగితే ఎలా తప్పించుకోవాలో పిల్లలకు చెప్పాలి. అఘాయిత్యానికి గురైతే వెంటనే షీటీంకు సమాచారం ఇవ్వాలి. జీడిమెట్ల, బాలానగర్‌, సనత్‌నగర్‌, జగద్గిరిగుట్ట పోలీ్‌సస్టేషన్ల పరిధిలో సంఘటనలపై సమాచారం ఇవ్వడానికి 9490617349 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు

- రమావత్‌ సుశీల, బాలానగర్‌ డివిజన్‌ షీటీం ఇన్‌చార్జి


ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్‌ నుంచి బ్యాగుల్లో పాములు

ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్‌ స్టేడియం

ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2024 | 10:30 AM