Yadadri: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో 9వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 19 , 2024 | 08:51 AM
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం (Sri Lakshminarasimha Swamy Devasthanam)లో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం ఉదయం శ్రీ మహావిష్ణు అలంకారం (Sri Mahavishnu Alankaram), లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహన సేవ (Garuda Vahana Seva)లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రాత్రి 8:45 గంటలకు దివ్య విమాన రథోత్సవము జరుగుతుంది.
కాగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ పర్వాలు సోమవారం రాత్రి వైభవంగా కొనసాగాయి. యాదగిరికొండపై ఉత్తర తిరుమాఢ వీధిలోని తాత్కాలిక బ్రహ్మోత్సవ కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగా కల్యాణ తంతును అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. వివిధ రకాల పుష్పా లు, అరటి, మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన కల్యా ణ వేదికపై అర్చకబృందం వేద మంత్రోచ్ఛారణ, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుల కల్యాణం కన్నుల పండువగా సాగింది.
ముక్కోటి దేవతలు ఆహుతులుగా, చతుర్ముఖ బ్రహ్మాది దేవతల సమక్షంలో దేవదేవుడు నృసింహుడు లోక కల్యాణార్థం సముద్రుడి తనయ మహాలక్ష్మీ అమ్మవారి మెడలో వేద పండితులు నిర్ణయించిన సుముహూ ర్త ఘడియ తులా లగ్నంలో మాంగల్యధారణ చేశారు. ముందుగా పట్టు వస్త్రాలు, స్వర్ణ, వజ్రవైఢూర్య, ముత్యాల ఆభరణాలతో నవ వరుడిగా అలంకృతుడైన లోక కల్యాణకారకుడు మృగనరుడు నారసింహుడు గజవాహనం అధిరోహించగా, భక్తజనకోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారిని పుష్పాల పల్లకిలో మంగళవాయిద్యాలు.. మేళతాళాలు.. భక్త జనుల జయ జయ ధ్వానాలు, రుత్వికుల వేదపారాయణాలు.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవ కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ కల్యాణమండపం పై ఎదురెదురుగా అధిష్ఠింపజేశారు. జగద్రక్షకుడు లక్ష్మీనృసింహుల కల్యాణ వేడుకలను శ్రీవైష్ణవ పాంచారాత్రగమ శాస్త్రరీతిలో దేవతల సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో శ్రీకారం చుట్టారు. నూత న కల్యాణమూర్తులు స్వామి, అమ్మవార్లకు అర్చకలు రక్షాసూత్రధారణ చేసి వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణతో నృసింహుడికి యజ్ఞోపవీత్రధారణ తంతు నిర్వహించా రు. దేవదేవుడు నృసింహుడికి లక్ష్మీ అమ్మవారి తండ్రి సముద్రుడు పాద ప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదానం చేశారు. బ్రహ్మోత్సవ కల్యాణంలో వధూవరులు నరసింహుడు, మహాలక్ష్మీ అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం అలంకరించే ఘట్టాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. అనంతరం ‘మాంగల్యం తంతు నానేనా, లోకరక్షణ హేతునా’ అనే అర్చకుల వేద మంత్రోచ్ఛరణ, భక్తజనుల గోవింద నామస్మరణ నడుమ అమ్మవారి మెడలో మాంగల్యధారణ కొనసాగింది. నూతన కల్యాణమూర్తులు లక్ష్మీనృసింహులను ముత్యాల తలంబ్రాలతో ఆచార్యులు కొలిచారు. కల్యాణ వేడుకల అనంతరం నూతన కల్యాణమూర్తులు స్వామి, అమ్మవార్లను పక్కపక్కన కూర్చుండబెట్టిన అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లక్ష్మీనృసింహుల బ్రహ్మోత్సవ తిరుకల్యాణ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకబృందం నిర్వహించగా, ఆలయ అనువంశీఖ ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.