TS EAPCET Results Today: టీఎస్‌ఎప్‌సెట్ ఫలితాలు నేడే విడుదల.. సమయం ఎప్పుడంటే..
ABN , Publish Date - May 18 , 2024 | 09:44 AM
టీఎస్‌ఎప్‌సెట్(TS EAPCET Results) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ(జే–హబ్)(JNTU) ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ డీన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి ..
హైదరాబాద్, మే 18: టీఎస్‌ఎప్‌సెట్(TS EAPCET Results) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ(జే–హబ్)(JNTU) ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ డీన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సమావేశమైన సెట్ కమిటీ సభ్యులు ఫలితాల వెల్లడికి ఆమోదం తెలపడంతో ఎప్‌సెట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్‌సెట్ పరీక్ష లు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంకు కార్డులను శనివారం ఉదయం 11.15 గంటల తర్వాత టీఎస్‌ఎప్‌సెట్ వెబ్‌సైట్(eapcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగిన ఎప్‌సెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 3.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టీఎస్‌పీజీఈసెట్ పరీక్షల తేదీల్లో మార్పు..
ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌పీజీఈసెట్) తేదీలను మార్చారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 నుంచి 9వరకు జరగాల్సిన పీజీఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్9న రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.