Share News

UPSC CSE Notification 2024: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్స్ ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Feb 14 , 2024 | 05:50 PM

UPSC CSE Notification 2024: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)కు UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి(ఫిబ్రవరి 14వ తేదీ) నుంచి మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరికాసేపటిలోగా నోటిఫికేషన్ లింక్ యాక్టివేట్ కానుంది.

UPSC CSE Notification 2024: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్స్ ఎప్పటి నుంచంటే..
UPSC CSE Notification 2024

UPSC CSE Notification 2024: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)కు UPSC నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి(ఫిబ్రవరి 14వ తేదీ) నుంచి మార్చి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరికాసేపటిలోగా నోటిఫికేషన్ లింక్ యాక్టివేట్ కానుంది. కాగా, యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరుగనుండగా.. అక్టోబర్ 19న మెయిన్స్ పరీక్ష జరుగనుంది. ఇదిలాఉంటే.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ను సందర్శించవచ్చు.

ప్రతి ఏటా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలోని కీలక పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా 1056 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. పరీక్ష మొదటి దశ.. ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్‌నికి ప్రతి ఏటా 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అటెండ్ అవుతారు. గత ఏడాది ప్రిలిమ్స్ పరీక్షను 13 లక్షల మంది రాశారు. మెయిన్స్ వచ్చేసరికి 14,600 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

అర్హతలు..

సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దిష్ట అర్హతలు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. చివరి సంవత్సరం గ్రాడ్యుయేట్లు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు కూడా UPSC ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వీరు UPSC మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు అవసరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ధృవీకరణ పత్రం సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

డిగ్రీతో సమానంగా ప్రభుత్వం గుర్తించిన ప్రొఫెషనల్, టెక్నికల్ అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులే. MBBS చివరి సంవత్సరం పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయని వారు UPSC CSEకి దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ సమయంలో సంబంధిత యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషనల్ అథారిటీ నుండి కోర్సు పూర్తయిన సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్నిసార్లు రాయొచ్చు..

యూపీఎస్సీ సవిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడానికి లిమిట్ ఉంది. అయితే, అభ్యర్థుల సామాజిక వర్గాల ఆధారంగా ఈ లిమిట్ అనేది పెరుగుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 ఏళ్ల వయస్సులోపు ఆరుసార్లు పరీక్ష రాయవచ్చు. OBC అభ్యర్థులు 35 ఏళ్ల వయస్సు వరకు తొమ్మిది ప్రయత్నాలు చేయొచ్చు. SC/ST అభ్యర్థులు 37 ఏళ్ల వయస్సు వరకు ఎన్నిసార్లైనా రాయొచ్చు. బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD ) 42 సంవత్సరాల వయస్సు వరకు తొమ్మిది ప్రయత్నాలు చేయొచ్చు. EWS అభ్యర్థులకు 32 సంవత్సరాల వయస్సు వరకు ఆరు ప్రయత్నాలు చేయొచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ పరీక్ష 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు స్టెప్ టు స్టెప్ మీకోసం..

1. UPSC అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.inకి వెళ్లండి.

2. హోమ్ పేజీలో UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 లింక్‌పై క్లిక్ చేయండి.(త్వరలో యాక్టివేట్ అవుతుంది).

3. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓటీఆర్ కంప్లీట్ చేయాలి.

4. ఒకసారి ఓటీఆర్ పూర్తి చేసిన తరువాత మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి.

5. దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి.

6. ఆ తరువాత అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి సబ్మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

7. ఈ అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీని సేవ్ చేసుకోవాలి.

Updated Date - Feb 14 , 2024 | 05:50 PM