Entrance Tests: యూసీడ్, సీడ్ నోటిఫికేషన్‌లు
ABN , Publish Date - Oct 05 , 2024 | 07:57 AM
బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీబీ)- డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్ టెస్ట్‌లకు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది.
బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీబీ)- డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్ టెస్ట్‌లకు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ‘అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్(యూసీడ్) 2025’ ద్వారా ‘బీడిజైన్’ ప్రోగ్రామ్‌లో; ‘కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్(సీడ్) 2025’ ద్వారా ‘ఎండిజైన్’, ‘పీహెచ్‌డీ’ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
యూసీడ్
ఈ ఎగ్జామ్ ద్వారా ఐఐటీ(హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, గువహటి, రూర్కీ), ఐఐఐటీడీఎం(జబల్పూర్) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్ కోర్సు చేసే అవకాశం కల్పిస్తారు. యూసీడ్ స్కోర్ వ్యాలిడిటీ ఏడాది. అభ్యర్థులు వరసగా రెండుసార్లు మాత్రమే ఈ టెస్ట్ రాయడానికి వీలుంది.
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్/కామర్స్/ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూప్‌తో ఇంటర్/పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీసీ గ్రూప్ చదివినవారు పై అయిదు సంస్థల్లో చేరవచ్చు. ఐఐఐటీడీఎంలో ప్రవేశానికి బైపీసీ అభ్యర్థులు కూడా అర్హులే. బైపీసీ సహా ఆర్ట్స్, కామర్స్ గ్రూప్‌లు చదివినవారు ఐఐటీ(హైదరాబాద్, బాంబే, ఢిల్లీ)లో చేరవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ కోర్సు పూర్తిచేసినవారు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు; హెచ్‌ఎ్‌ససీ ఒకేషనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులు; కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహించే హైస్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు; జనరల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్(జీసీఈ) ఎగ్జామినేషన్(లండన్/కేంబ్రిడ్జ్/శ్రీలంక) అడ్వాన్స్‌డ్ లెవెల్ పూర్తిచేసినవారు యూసీడ్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. 2023లోగానీ అంతకుముందుగానీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థులు 2000 అక్టోబరు 1న లేదా ఆ తరవాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
టెస్ట్ వివరాలు:
పరీక్ష సమయం మూడు గంటలు. మొత్తం మార్కులు 300. ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్ 200 మార్కులకు ఉం టుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి రెండు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో 14 న్యూమరికల్ ఆన్సర్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు నాలుగు మార్కులు నిర్దేశించారు. వర్చ్యువల్ కీబోర్డ్ ఉపయోగించి స్ర్కీన్‌పై సమాధానాన్ని టైప్ చేయాలి. వీటికి నెగెటివ్ మార్కులు ఉండవు. రెండో సెక్షన్‌లో 15 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉం టాయి. అన్నింటినీ సరిగా గుర్తిస్తే ప్రశ్నకు నాలుగు మార్కులు ఇస్తారు. ఎన్ని సమాధానాలు సరిగా గుర్తిస్తే అన్ని మార్కులు ఇస్తారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. మూడో సెక్షన్‌లో 28 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు నిర్దేశించారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి 0.71 మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్ 100 మార్కులకు ఉంటుంది. దీనికి గంట సమయం ఇస్తారు. ఇందులో అభ్యర్థి డ్రాయింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేలా స్కెచింగ్, డిజైన్ ఆప్టిట్యూడ్ అంశాలనుంచి రెండు ప్రశ్నలను కంప్యూటర్ స్ర్కీన్‌మీద చూపిస్తారు. దీనికి సమాధానాన్ని ఆన్సర్ బుక్‌లో రాయాలి. మొదటి పార్ట్‌లో నిర్దేశిత కటాఫ్ మేరకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సంబంధించిన రెండో పార్ట్‌ను పరిశీలించి యూసీడ్ 2025 స్కోర్ ప్రకటిస్తారు.
సీడ్
ఈ ఎగ్జామ్ ద్వారా ఐఐఎస్సీ(బెంగళూరు), ఐఐఐటీడీఎం(జబల్పూర్), ఐఐటీ(హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, రూర్కీ) సంస్థల్లో ఎండిజైన్ చేసే అవకాశం కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్ స్కూళ్లలో పీహెచ్‌డీ చేయవచ్చు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా ‘సీడ్’ రాయవచ్చు. సీడ్ స్కోర్ వ్యాలిడిటీ ఏడాది.
ఎండిజైన్ స్పెషలైజేషన్‌లు:
బెంగళూరు ఐఐఎస్సీలో ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్; బాంబే ఐఐటీలో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికిల్ డిజైన్; ఢిల్లీ, రూర్కీ ఐఐటీల్లో ఇండస్ట్రియల్ డిజైన్; గువహటి, కాన్పూర్ ఐఐటీల్లో డిజైన్; హైదరాబాద్ ఐఐటీలో విజువల్ డిజైన్ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత:
ఇంటర్ తరవాత కనీసం మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి తరవాత అయిదేళ్ల జీడీ ఆర్ట్స్ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.
టెస్ట్ వివరాలు:
ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్ 150 మార్కులకు ఉంటుంది. దీనికి గంట సమయం ఇస్తారు. ఇందులో ఎనిమిది న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు, పది మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. వీటితోపాటు 26 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ప్రత్యేకించారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నల్లో సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1 మార్కు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో అయితే 0.5 మార్కులు కోత విధిస్తారు. రెండో పార్ట్ 100 మార్కులకు ఉంటుంది. దీనికి రెండు గంటల సమయం ఇస్తారు. ఇందులో స్కెచింగ్, క్రియేటివిటీ, ఫామ్ సెన్సిటివిటీ, విజువల్ సెన్సిటివిటీ, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ విభాగాల నుంచి అయిదు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 20 మార్కులు ప్రత్యేకించారు. మొదటి పార్ట్‌లో నిర్దేశిత కటాఫ్ మేరకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సంబంధించిన రెండో పార్ట్‌ను మాత్రమే పరిశీలిస్తారు. మొదటి పార్ట్‌కు 25 శాతం, రెండో పార్ట్‌కు 75 శాతం వెయిటేజీ ఇస్తూ సీడ్ 2025 స్కోర్ నిర్ణయిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31
వెబ్‌సైట్: www.uceed.iitb.ac.in, www.ceed.iitb.ac.in
Also Read:
Hard Work: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. అది నిజమే కదా..
Good news: త్వరపడండి.. బెల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
RRB Recruitment: ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, ఫీజు వివరాలివే
For More Education News and Telugu News..