Share News

TG Politics: వెరీ గుడ్డు ఎవరో.. గాడిద గుడ్డు ఎవరికో!

ABN , Publish Date - May 07 , 2024 | 05:42 AM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ బాగా పాపులర్‌ అయుంది. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ‘గుడ్డు’ చుట్టూ రాజకీయం జరుగుతోంది.

TG Politics: వెరీ గుడ్డు ఎవరో.. గాడిద గుడ్డు ఎవరికో!

  • రాష్ట్రంలో ‘గాడిద గుడ్డు’ కేంద్రంగా ప్రచారం

  • ముఖ్యనేతల నుంచి ద్వితీయ శ్రేణి కేడర్‌ దాకా ‘గుడ్డు’ జపమే

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ బాగా పాపులర్‌ అయుంది. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ‘గుడ్డు’ చుట్టూ రాజకీయం జరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలోనే తెలంగాణలో చిత్రవిచిత్ర పదాలు, వ్యవహారాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏ అంశంపై మాట్లాడినా, ఏ చర్చ జరిగినా.. అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ‘గాడిద గుడ్డు’కే లంకె పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని, కేవలం ‘‘గాడిద గుడ్డు’’నే ఇచ్చిందంటూ ఓ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ గుడ్డు వ్యవహారం మొదలైంది.


అది ఇప్పుడు ఎంతవరకూ వెళ్లిందంటే.. ప్రధాన రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లలో మాట్లాడే నాయకులంతా ‘గాడిద గుడ్డు’ పదంతోనే ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. దానితోనే ముగిస్తున్నారు. అన్ని పార్టీల ముఖ్యనేతలందరూ ఈ పదాన్ని విరివిగా వాడుతుండడంతో ద్వితీయ శ్రేణి కేడర్‌ కూడా ఇదే పదాన్ని జపిస్తున్నారు. మరోవైపు గుడ్డునే ప్రధాన అంశంగా చేసుకుని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెరసి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పార్టీలు ‘గాడిద గుడ్డు’ కేంద్రంగానే ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీంతో జనం కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినపుడు టీచర్లు ఇచ్చే వెరీగుడ్డు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఛలోక్తులు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 13న జరగబోయే పోలింగ్‌లో ‘‘వెరీగుడ్డు’’ ఎవరో, ‘గాడిద గుడ్డు’ ఎవరికో తేలుతుందంటున్నారు.

Updated Date - May 07 , 2024 | 05:42 AM