Share News

TS Lok Sabha Polls: జహీరాబాద్‌లో బీసీల బాద్‌షా ఎవరో..?

ABN , Publish Date - May 06 , 2024 | 06:34 AM

సరిహద్దున ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంటు స్థానం. మెజారిటీ సంఖ్యలో బీసీ ఓటర్లు. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీసీ నేతకే ఎంపీగా పట్టం.

TS Lok Sabha Polls: జహీరాబాద్‌లో బీసీల బాద్‌షా ఎవరో..?

  • ఇక్కడ బీసీ నేతల మధ్య ముక్కోణ పోరు

  • పార్టీ మారి హ్యాట్రిక్‌ కోసం బీబీ పాటిల్‌ ప్రయత్నం.. అధికారం అండగా సురేశ్‌ షెట్కార్‌

  • అధిష్ఠానం దన్నుతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ పోరాటం

  • అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రకు

సరిహద్దున ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంటు స్థానం. మెజారిటీ సంఖ్యలో బీసీ ఓటర్లు. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీసీ నేతకే ఎంపీగా పట్టం. తాజా ఎన్నికల్లో బీసీ నేతలనే బరిలోకి దించిన మూడు ప్రధాన పార్టీలు. ఇలా బీసీల అడ్డాగా నిలిచిన జహీరాబాద్‌ పార్లమెంటు స్థానంలో మరోసారి బీసీ అభ్యర్థుల మధ్యే పోరు జరుగుతుండడంతో ‘బీసీల బాద్‌షా‘ ఎవరవుతారన్న ఆసక్తి నెలకొంది.


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి): నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు కామారెడ్డి జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లలో జరిగిన ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ వరుసగా రెండుసార్లు విజయం సాదించారు. అయితే తాజా ఎన్నికలకు ముందు బీబీ పాటిల్‌ బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పారు. బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. దీంతో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తమ పార్టీ తరఫున గాలి అనిల్‌కుమార్‌ను బరిలోకి దించిది. కాగా, కాంగ్రెస్‌ నుంచి 2019 ఎన్నికలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు.


బీసీ, ముస్లిం మైనారిటీల ఓట్లపైనే గురి

మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్న జహీరాబాద్‌ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్నారు. బీసీల్లో లింగాయత్‌ సామాజికవర్గం ఓటర్లు 2.50 లక్షల మంది వరకు ఉండగా, మున్నూరుకాపు సామాజికవర్గం ఓటర్లు 3లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఇక ముస్లింలూ సుమారు 3 లక్షల వరకు ఉంటారు. లింగాయత్‌ సమాజం ఓటర్లు ఎక్కువగా జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జుక్కల్‌ సెగ్మెంట్లలో ఉండగా, ముస్లిం ఓటర్లు జహీరాబాద్‌, కామారెడ్డి సెగ్మెంట్లలో ఎక్కువగా ఉన్నారు. మున్నూరుకాపు ఓటర్లు ఎక్కువగా బాన్సువాడ, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌ సెగ్మెంట్లలో ఉన్నారు. కాగా, మున్నూరుకాపు ఓట్లు తమకే ఎక్కువగా వస్తాయని ఆ సామాజిక వర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌ ధీమాతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులిద్దరూ లింగాయత్‌ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది కీలకంగా మారింది.

ఎవరి ధీమా వారిదే..

సిటింగ్‌ ఎంపీగా ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగిన బీబీ పాటిల్‌ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. కాగా, గతంలో ఓసారి గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ మరోసారి విజయం కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ గెలవని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మున్నూరుకాపు సామాజికవర్గ ఓటర్లనే నమ్ముకున్నారు. వాస్తవానికి అనిల్‌కుమార్‌ ఈ నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తి. ఆయన కూడా తనకు మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టికెట్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని కోరారు. కానీ, అధిష్ఠానం జహీరాబాద్‌ టికెట్‌ ఇవ్వడంతో ఆయన కొద్దిరోజులపాటు అసంతృప్తితో ఉండిపోయారు. చివరకు హరీశ్‌రావు జోక్యంతో పోటీకి సిద్ధమయ్యారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం, ఈ పార్లమెంటు స్థానం పరిధిలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పూర్తి అండదండలు అందిస్తుండడం సురేశ్‌ షెట్కార్‌కు బలాన్నిస్తోంది. ఇక్కడ ఇన్‌చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహ, సహ ఇన్‌చార్జిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆ పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. మొత్తంగా ముగ్గురు అభ్యర్థులూ విజయంపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు.


అధినేతల రాకతో వేడెక్కిన ప్రచారం

మూడు ప్రధాన పార్టీల అధినేతలు రావడంతో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారం వేడెక్కింది. తొలుత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనగా, సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ జనజాతర సభకు హాజరయ్యారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే విశాల్‌ జనసభలో పాల్గొన్నారు. బీబీ పాటిల్‌కు ఓటు వేయడమంటే నరేంద్రమోదీకి ఓటు వేసినట్లేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతల రాకతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. 42-43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలతో ఎండలు మండుతున్నా అభ్యర్థులు, నాయకులు లెక్క చేయకుండా ఊరూరా ప్రచారం చేస్తున్నారు.

Updated Date - May 06 , 2024 | 07:17 AM