Share News

Health : రోజూ టీ తాగుతున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త..

ABN , Publish Date - Dec 30 , 2024 | 08:01 PM

నిద్రలేవగానే గొంతులో వేడివేడిగా కాస్తంత ఛాయ్ పడందే పనుల్లోకి దిగరు చాలామంది. కుటుంబంతో కలిసి టీ తాగడం దినచర్య భాగమైపోయింది. అలసటగా అనిపించినా, ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినా టీ నే మొదటి ఛాయిస్. రోజుకు కనీసం 3 కప్పులైనా తాగకుండా ఉండలేరు టీ ప్రియులు. అయితే, మీకెంతో ఇష్టమైన టీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని మీకు తెలుసా?

Health : రోజూ టీ తాగుతున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త..
Tea Bags Effects to Health

నిద్రలేవగానే గొంతులో వేడివేడిగా కాస్తంత ఛాయ్ పడందే పనుల్లోకి దిగరు చాలామంది. కుటుంబంతో కలిసి టీ తాగడం దినచర్య భాగమైపోయింది. అలసటగా అనిపించినా, ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినా టీ నే మొదటి ఛాయిస్. రోజుకు కనీసం 3 కప్పులైనా తాగకుండా ఉండలేరు టీ ప్రియులు. పేదవారి నుంచి ధనికుల వరకూ అందరికీ ఫేవరెట్ పానీయం ఛాయ్. అందుకే ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా పని ఒత్తిడి నుంచి బయటపడి రిలాక్స్ అయ్యేందుకు టీ తాగుతుంటారు. ఎక్కువమంది ఉద్యోగులు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇన్‌స్టంట్ టీ బ్యాగులు తమతో తీసుకెళుతుంటారు. ఛాయ్‌ వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అందరి నమ్మకం. అయితే, మీకెంతో ఇష్టమైన టీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని మీకు తెలుసా?


బరువు తగ్గేందుకు గ్రీన్ టీ మంచిదని సెలబ్రిటీలు చెప్పడం వినే వింటారు. ఇంట్లో ఉన్నా, పనిలో బిజీగా ఉన్నా త్వరగా చేసుకునేందుకు, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి టీ బ్యాగులు సౌలభ్యంగా ఉంటాయి. అందుకే ఈ మధ్య టీ బ్యాగుల వాడకం ప్రజల్లో బాగా పెరిగింది. గ్రీన్ టీ లేదా నార్మల్ టీ బ్యాగులు ఏవి వినియోగించినా లాభాల కంటే నష్టాలే ఎక్కువని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.


టీ బ్యాగ్స్ వాడితే జరిగేది ఇదే..

బ్రాండ్ ఏదైనా టీ బ్యాగ్‍‌లు వేడి నీళ్లలో ముంచినపుడు బిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతాయి. ఈ చిన్నపాటి ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి వెళితే క్యాన్సర్‌, సంతానలేమి సహా అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


అధ్యయనంలో ఇలా..

పరిశోధకులు మూడు రకాల టీ బ్యాగ్‌లను అధ్యయనం చేశారు. నైలాన్, పాలీప్రొఫైలిన్ సూపర్ మార్కెట్లలో లభించే సాధారణ టీ బ్యాగ్‌లను 95°C నీటిలో ఉంచి పరిశీలించారు. అందులో పాలీప్రొఫైలిన్ టీ బ్యాగ్‌లు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించబడ్డాయి. ఒక్కో మిల్లీలీటర్‌కు 1.2 బిలియన్ మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతాయి. నైలాన్ టీ బ్యాగ్‌లు ప్రతి మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేశాయి.


తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు..

శరీరంలోని అంతర్గత అవయవాలలో మైక్రోప్లాస్టిక్‌లు పేరుకుపోతాయని పరిశోధనలో తేలింది. ఇవి పేగు గోడలను దెబ్బతీస్తాయి. కణాలలోకి ప్రవేశించి DNAను ప్రభావితం చేస్తాయి. క్యాన్సర్, పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ పడిపోవడం, పెద్ద పేగు వ్యాధులకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఇలా చేసిన టీ మంచిది..

ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా డీకాషన్ చేసిన టీనే వాడాలి. తాగేటప్పుడు గాజు లేదా స్టీల్ పాత్రలనే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 30 , 2024 | 08:02 PM