ట్రంప్‌పై కాల్పులకు యత్నించింది 58 ఏళ్ల ర్యాన్ రౌత్
ABN , Publish Date - Sep 17 , 2024 | 03:52 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా దాడికి యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల వయసున్న ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా దాడికి యత్నించిన వ్యక్తిని 58 ఏళ్ల వయసున్న ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ ఆడుకుంటుండగా.. గోల్ఫ్ కోర్టుకు ఆనుకొని ఉన్న పొదల్లో 58 ఏళ్ల వయసున్న ర్యాన్ వెస్లీ రౌత్ అత్యంత శక్తిమంతమైన ఏకే-47-స్టైల్ తుపాకీతో 12 గంటల పాటు మాటువేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించి కాల్పులు జరపగా, రౌత్ ఆ పొదల్లోంచి బయటికి వచ్చి నల్లని కారులో అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన స్థలం నుంచి ఏకే-47-స్టైల్ తుపాకీ, గోప్రో కెమెరాను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా అధికారులు ఆ కారును గుర్తించి రౌత్‌ను అరెస్టు చేశారు.
ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోవాలని ఆకాంక్ష..
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం నార్త్ కరోలినా గ్రీన్స్‌బోరోకు చెందిన రౌత్ గతంలో నిర్మాణరంగంలో పనిచేశాడు. సాయుధ పోరాటంలో పాల్గొనాలనే బలమైన ఆకాంక్షను గతంలో సామాజిక మాధ్యమాల ద్వారా అతను వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్‌కు వెళ్లి యుద్ధంలో పాల్గొనాలని, ఆ యుద్ధంలోనే చనిపోవాలని ఉందని రౌత్ ‘ఎక్స్’లో చేసిన పోస్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘ఉక్రెయిన్ సరిహద్దులోకి వెళ్లి స్వచ్ఛందంగా యుద్ధం చేసి చనిపోవాలని ఉంది’ అని రౌత్ రాశాడు. అలాగే, ప్రపంచ యుద్ధాల తీరును మార్చేయాలని కూడా ప్రజలకు రౌత్ పిలుపునిచ్చాడు. ‘పౌరులు తప్పకుండా ఈ యుద్ధాన్ని మార్చివేయాలి. భవిష్యత్తు యుద్ధాలను కూడా నివారించాలి. మనలో ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతుగా అడుగులు వేయాలి. మనలో ప్రతి ఒక్కరూ చైనా ప్రజలకు తప్పకుండా సాయం చేయాలి’ అని వాట్స్‌పలోని తన బయోలో రౌత్ రాసుకున్నాడు.