Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనూర దిసనాయకే
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:11 AM
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, జనతా విముక్తి పెరమన(జేవీపీ)నాయకుడు అనూర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు.
దేశ చరిత్రలో తొలి మార్క్సిస్ట్ నేతగా రికార్డు
కొలంబో, సెప్టెంబరు 22: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, జనతా విముక్తి పెరమన(జేవీపీ)నాయకుడు అనూర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న తొలి మార్క్సిస్ట్ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవేగయ(ఎ్‌సజేబీ) నాయకుడు సజిత్ ప్రేమదాసపై ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో దిసనాయకే గెలుపొందినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని తెలిపింది. దిసనాయకే దేశ తొమ్మిదో అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని జేవీపీ ప్రకటించింది. అవినీతి నిర్మూలన నినాదం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతానని అనూర చేసిన వాగ్దానాలు యువ ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మీడియాతో దిసనాయకే మాట్లాడుతూ.. జాతి ఐక్యత కోసం కలిసి పోరాడుదాం అన్ని పిలుపునిచ్చారు.
కాగా, రాజపక్సా కాలం నాటి పరిస్థితుల వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యత, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టేకించడం వంటి సవాళ్లను దిసనాయకే ఎదుర్కొబోతున్నారు. కాగా, ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. శనివారం జరిగిన ఎన్నికల్లో విజయానికి అవసరమైన 50ు ఓట్లు ఏ అభ్యర్థి సాధించకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగిందని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్‌ఎంఏఎల్ రత్నాయకే ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికల్లో 38 మంది పోటీ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే 17.41 శాతం ఓట్లతో తొలి రౌండ్‌లో పోటీ నుంచి నిష్క్రమించారు.